అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం
LK Advani: భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి లాల్ కిషన్ అద్వానీకి అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. స్వయంగా రాష్ట్రపతి ఆయన నివాసానికి వెళ్లి ఈ పురస్కారాన్ని అందజేశారు.
దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డు కోసం ఎల్‌కే అద్వానీ పేరును కేంద్ర ప్రభుత్వం ఇదివరకే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు కూడా మరణానంతరం ఈ అవార్డును ప్రకటించింది.

శనివారమే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను అందజేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్ రావు, చరణ్ సింగ్ తరఫున జయంతి చౌదరి ఈ అవార్డులను అందుకున్నారు. కర్పూరీ ఠాకూర్ తనయుడు రామ్‌నాథ్ ఠాకూర్, స్వామినాథన్ కుమార్తె నిత్యా రావు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.
తాజాగా ఎల్ కే అద్వానీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. నడవలేని స్థితిలో ఉన్నందున ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లారు రాష్ట్రపతి. ఈ అవార్డును స్వయంగా మెడలో అలంకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి జగ్‌దీప్ ధన్‌కర్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.

అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం యావత్ దేశాన్నీ జాగృతం చేశారు అద్వానీ. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ దేశం మొత్తం రథయాత్రను నిర్వహించారు. హిందువులనందరినీ ఏకతాటిపైకి తీసుకుని వచ్చారు. దేశంలో బీజేపీ క్షేత్రస్థాయిలో అత్యంత బలోపేతం కావడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారాయన.
అత్యుత్తమ పార్లమెంటేరీయన్ అవార్డునూ అందుకున్న వారిలో ఒకరు అద్వానీ. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఘన విజయం సాధించారు. 1991లో తొలిసారిగా ఇక్కడి నుంచి గెలుపొందారాయన. అనంతరం 1998 నుంచి 2014 వరకూ ఓటమి అనేదే లేకుండా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల నుంచి వైదొలిగారు. విశ్రాంతి తీసుకుంటోన్నారు.












Click it and Unblock the Notifications