రాష్ట్రపతి ఎవరో ? తేలని అధికార, విపక్ష అభ్యర్ధులు-నేడు ఎన్డీయే, విపక్షాల భేటీలు
త్వరలో జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల విషయంలో అధికార ఎన్డీయే, విపక్షాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇప్పటికే ఈ అత్యన్నత వదవికి నామినేట్ చేసేందుకు పలువురు అభ్యర్దుల్ని పరిశీలించిన బీజేపీ ఏ నిర్ణయం తీసుకోలేకపోయింది. దీంతో ఇవాళ పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం ఏర్పాటు చేసింది. అలాగే విపక్షాలు కూడా ఇప్పటికే ముగ్గురు అభ్యర్ధులు కాదనడంతో చివరి సారిగా ఇవాళ మరోసారి భేటీ అవుతున్నాయి.

రాష్ట్రపతి అభ్యర్ధులపై ఉత్కంఠ
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై ఉత్కంఠ పెరుగుతోంది. పార్లమెంటుతో పాటు ఎలక్ట్రోరల్ కాలేజీలో దాదాపు మెజారిటీ ఉన్న ఎన్డీయేతో పాటు విపక్ష పార్టీల కూటమి కూడా తమ అభ్యర్ధుల్ని ఎంపిక చేసుకునే విషయంలో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధికార ఎన్డీయే మెజారిటీకి కాస్త దూరంలో ఉన్నప్పటికీ వైసీపీ, బీజేడీ, అన్నాడీఎంకే వంటి పార్టీల మద్దతుతో గట్టెక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా అభ్యర్ధి ఎంపిక బీజేపీకి కూడా సవాల్ గా మారుతోంది. అదే సమయంలో విపక్షాలు కూడా ఉమ్మడి అభ్యర్ధిపై తీవ్ర మథనపడుతున్నాయి.

ఇంకా తేలని ఎన్డీయే అభ్యర్ధి
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఎన్డీయే అభ్యర్ధి ఇంకా తేలలేదు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా తమ అభ్యర్ధిని గెలిపించుకునే మెజారిటీ ఉన్నప్పటికీ ఎన్డీయేకూ ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో అధికార కూటమి తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధి ఎవరనేది తేలడం లేదు. ఇప్పటికే ద్రౌపతి ముర్ము, అనసూయ ఉకే తో పాటు పలువురు అభ్యర్ధుల పేర్లపై చర్చలు జరిగినా తుది అభ్యర్ధి మాత్రం తేలలేదు. దీంతో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతోంది. ఇందులో ప్రధాని మోడీతో పాటు బీజేపీ కీలక నేతలు పాల్గొని రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేయనున్నారు.

విపక్ష అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హా ?
విపక్షాల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే ఉమ్మడి అభ్యర్ధి విషయంలోనూ చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, గోపాలకృష్ణగాంధీ రూపంలో ముగ్గురు నేతలు విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా పోటీలో ఉండేందుకు ససేమిరా అనేశారు. ఇప్పుడు మాజీ కేంద్రమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఉన్న యశ్వంత్ సిన్హాను దీదీ మమతా బెనర్జీ తెరపైకి తెచ్చారు. గతంలో వాజ్ పేయికి సన్నహితుడిగా పేరు తెచ్చుకున్న యశ్వంత్ సిన్హాను తెరపైకి తీసుకురావడం ద్వారా ఎన్డీయేను ఇరుకునపెట్టాలని మమత భావిస్తున్నారు. యశ్వంత్ పేరును ఏకాభిప్రాయం ద్వారా ప్రకటించేందుకు ఇవాళ విపక్షాలు భేటీ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications