రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు: వెంట పవార్, రాహుల్, కేటీఆర్ సహా నేతలు
న్యూఢిల్లీ: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఉన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నేత ప్రఫుల్ పటేల్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. నామినేషన్ దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. రాష్ట్రపతి ఎన్నికలు జులై 18న జరగనున్నాయి. జులై 21న ఫలితాలు వెలువడతాయి.

నామినేషన్ దాఖలు చేసిన తర్వాత విజయ్ చౌక్ వద్ద గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కాగా, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకే తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ తరపున మంత్రి కేటీఆర్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. జూన్ 24న ఆమె నామినేషన్ దాఖలు చేశారు.
యశ్వంత్ సిన్హా ప్రస్థానం గమనించినట్లయితే.. యశ్వంత్ సిన్హా బీహార్ రాజధాని పాట్నాలో 1937 నవంబర్ 6న జన్మించారు. 1958లో యూనివర్సిటీ ఆఫ్పాట్నాలో పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే 1962 వరకు ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1960లోనే సిన్హా ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. 24 ఏళ్ల పాటు సేవలందించారు. పలు కీలక పదవులు చేపట్టారు. ఆ తర్వాత 1984లో జనత పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేశారు. 1986లో పార్టీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.
1988లోనే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1989లో జనతాదళ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీకి జనరల్ సెక్రెటరీగా నియమితులయ్యారు. అప్పటి ప్రధాని చంద్రశేఖర్ కేబినెట్లో 1990 నవంబర్ 1 నుంచి 1991 జూన్ వరకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు.ఇక, బీజేపీ ఏర్పాటయ్యాక 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా యశ్వంత్‌సిన్హా నియమితులయ్యారు. 1998, 1999, 2009లో హజారీబాగ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1998-2022 మధ్య కాలలో అటల్‌బిహారీ వాజపేయీ హయాంలో ఆర్థిక మంత్రిగా సేవలందించారు యశ్వంత్ సిన్హా. 2002-2004 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.












Click it and Unblock the Notifications