Maharashtra Assembly election 2024: కాంగ్రెస్ పై ప్రధాని మోదీ ఫైర్.. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా
ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ హర్యానాలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఫలితాలు బీజేపీ మంచి ఊపును తీసుకొచ్చాయి. హర్యానా ఫలితాలు ఇచ్చిన బూస్ట్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. నాగ్ పూర్ లో పీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వర్చువల్ గా పాల్గొన్నారు. రూ.7,600 కోట్లకు పైగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
నాగ్‌పూర్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం, షిర్డీ విమానాశ్రయంలో కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనం అభివృద్ధికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.కాంగ్రెస్, నక్సల్ మిత్రపక్షాల విద్వేషపూరిత కుట్రలకు తాము బలి కాబోమని హర్యానా ప్రజలు తేల్చి చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. హర్యానాలోని దళిత సంఘాలు బీజేపీకి మద్దతు ఇచ్చాయని మోదీ అన్నారు. కాంగ్రెస్ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసినా ఫలించలేదని పేర్కొన్నారు.

బీజేపీ రైతు బంధు పథకాలతో హర్యానా రైతులు సంతోషంగా ఉన్నారని గుర్తు చేశారు. అందరూ బీజేపీని నమ్ముతున్నారని అన్నారు. హర్యానాలో మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక విజయంగా అభివర్ణించారు. కాంగ్రెస్ అసత్యాలు వ్యాపింపజేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. హర్యానా ఫలితాలు మంగళవారం వెలువడిన సంగతి తెలిసిందే. అక్కడ బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించింది. 90 సీట్లు ఉన్న హర్యానాలో బీజేపీ 48 చోట్ల గెలుపొందగా.. కాంగ్రెస్ 37 స్థానాల్లో విజయం సాధించింది.
ఈ ఏడాది నవంబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానం మహారాష్ట్రపై దృష్టి సారించింది. ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించినట్లు తెలుస్తోంది. అక్కడ ఎన్సీపీ, కాంగ్రెస్ కూడా బలంగా ఉన్నట్లు పలు సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే సర్వే అంచనాలు హర్యానా ఎన్నికల్లో తారుమారు అయ్యాయి.












Click it and Unblock the Notifications