నరేంద్ర మోడీ ప్రత్యేక ప్యాకేజ్ పెద్ద మాయ
పాట్నా: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిమ్మినిబోమ్మి చేసి చూపిస్తున్నారని, శాసన సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీహార్ ప్రజలను మాయ చేస్తున్నారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మండిపడ్డారు. ఎవరిని మోసం చెయ్యడానికి ఈ నాటకాలు ఆడుతున్నారని మోడీని ప్రశ్నించారు.
బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న పథకాలకు కేటాయించిన నిధులనే ప్రత్యేక ప్యాకేజీగా చూపించి మోసం చేస్తున్నారని ఆరోపించారు. రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ అంటు చెప్పుకుంటున్నారని, అయితే వచ్చేది మాత్రం రూ. 10,368 కోట్లు మాత్రమే అని చెప్పారు.
అది కూడ ఎప్పుడు ఇస్తారో, నిధులు ఎలా విడుదల అవుతాయో మోడీ చెప్పలేదని విమర్శించారు. పాట్నాలో బీహార్ ఆర్థిక శాఖ మంత్రి బిజేంద్ర ప్రసాద్ యాదవ్ తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్యాకేజీలో రూ. 54 వేల కోట్ల విలువైన 41 జాతీయ రహదారుల ప్రాజెక్టులు చూపారని, ఇందులో ఇప్పటికే రూ. 47 వేల కోట్ల నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఇప్పుడు కేవలం రూ. 7 వేల కోట్లు అదనంగా చేర్చారని చెప్పారు.
గ్రామీణాభి వృద్ధి ప్రాజెక్టుల ప్యాకేజీలో రూ. 13,820 కోట్లు చూపారని, ఆ నిధులు ఇప్పటికే మంజూరు అయ్యాయని గుర్తు చేశారు. సహజ వాయువు, పేట్రోలియం రంగంలో రూ. 21,476 కోట్లు చూపారని, అందులో ఇప్పటికే రూ. 21,127 కోట్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు.
ఇప్పటికి కేవలం రూ. 224 కోట్లు అదనంగా మంజూరు చేసి రూ. 1.25 లక్షల కోట్ల ప్యాకేజీ అంటు గొప్పలు చెప్పుకుంటున్నారని నరేంద్ర మోడీ మీద మండిపడ్డారు. బీహార్ రాష్ట్ర ప్రజలు హాయిగానే ఉన్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications