పార్లమెంట్ పై మరో ఉగ్రదాడి ? డిసెంబర్ 13న పునాదులు కదిలిస్తామంటూ..
గతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు భారత ప్రజాస్వామ్య సౌధమైన పార్లమెంటుపై దాడికి పాల్పడి ఈ నెల 13కి 22 ఏళ్లు కావస్తోంది. 2001 డిసెంబర్ లో జరిగిన ఈ దాడిని సైన్యం సమర్ధంగా తిప్పికొట్టడంతో పాటు తీవ్రవాదులందరినీ కాల్చిచంపింది. ఇప్పుడు ఈ దాడి జరిగి 22 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో మరోసారి పార్లమెంటుపై దాడి చేస్తామంటూ మరో ఉగ్రవాద సంస్ధ హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి సిక్కుల కోసం పోరాడుతున్నామంటూ చెప్పుకుంటున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్ధ ఈ హెచ్చరికలు చేసింది.
అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్ధ అధినేత అయిన గురుపత్వంత్ సింగ్ పన్నున్ భారత పార్లమెంటుపై దాడి జరిగి 22 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే మరోసారి దాడి చేస్తామంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేశాడు. దీంతో ప్రత్యేక ఖలిస్తాన్ కోరుతున్న ఈ ఉగ్రవాద సంస్ధ హెచ్చరికలు తీవ్ర కలకలం రేపాయి.

2001 పార్లమెంటు దాడి వార్షికోత్సవం అయిన డిసెంబర్ 13న పార్లమెంటు పునాదిని కదిలిస్తానని బెదిరిస్తూ అమెరికాకు చెందిన ఖలిస్తానీ మద్దతుదారు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఒక వీడియోను విడుదల చేయడంతో ఢిల్లీ పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఆ ఖలిస్తానీ నాయకుడిని చంపడానికి భారతదేశం ప్రయత్నించిందని అమెరికా ఆరోపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడంతో ఈ హెచ్చరికలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఢిల్లీలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సెంట్రల్, న్యూ ఢిల్లీ జిల్లాల చుట్టూ, పార్లమెంట్, చుట్టుపక్కల అదనపు భద్రతను మోహరించినట్లు ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారులు తెలిపారు. అసలే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సిక్కు తీవ్రవాదుల హెచ్చరికలు ఎంపీల్ని కలవరపెడుతున్నాయి. దీంతో ఏమాత్రం రిస్క్ తీసుకోవద్దని పోలీసులకు కూడా ఆదేశాలు అందాయి.












Click it and Unblock the Notifications