వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దిల్లీలోని జేఎన్‌యూలో మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ ప్రదర్శనపై నిరసనలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో శనివారం రాత్రి బీబీసీ రూపొందించిన 'ఇండియా: ది మోదీ క్వశ్చన్’ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి నిర్వహించిన ఈ ప్రదర్శనను దాదాపు వంద మంది వరకూ చూశారని బీబీసీతో చెప్పారు విద్యార్థి సంఘ నాయకులు.

అయితే, ఈ ప్రదర్శనపై మంగళవారం వివాదం చెలరేగింది. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించిందనీ, కాబట్టి దాన్ని క్యాంపస్ లో ప్రదర్శించడం సరికాదంటూ యూనివర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసింది ఏబీవీపీ విద్యార్థి సంఘం.

ఇక, దిల్లీలోని జవహర్‌ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో మంగళవారం రాత్రి ఇదే డాక్యుమెంటరీని ప్రదర్శించినప్పుడు, అది చూస్తున్న విద్యార్థులపై కొంతమంది రాళ్లు రువ్వారు.

దాంతో, విద్యార్థులు జేఎన్‌యూ గేటు వరకు మార్చ్ చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విద్యార్థులపై ఈ రాళ్లు రువ్వింది ఎవరన్నది తెలియలేదు. ఈ సంఘటనలో కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయాలు పాలైన విద్యార్థులు సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందారు.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

జేఎన్‌యూలో ఏం జరిగింది...

నర్మదా హాస్టల్‌ ముందున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘానికి చెందిన కార్యాలయంలో రాత్రి 9 గంటలకు ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ఒక రోజు ముందు జేఎన్‌యూ విద్యార్థి సంఘం దీనిపై ప్రకటన చేసింది.

విద్యార్థి సంఘం ప్రకటన తర్వాత, ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించే కార్యక్రమానికి తాము అనుమతి ఇవ్వబోమని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ అడ్వయిజరీ జారీ చేసింది.

విద్యార్థులు డాక్యుమెంటరీ ప్రదర్శనను రద్దు చేసుకోవాలని సూచించింది.

ఒకవేళ అలా చేయకపోతే తాము క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది.

డాక్యుమెంటరీని ప్రదర్శించనున్న నేపథ్యంలో రాత్రి 8 గంటలకే విద్యార్థులందరూ నర్మదా హాస్టల్‌ ముందున్న జేఎన్‌యూ విద్యార్థి సంఘ కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ, దీన్ని స్క్రీన్ చేయడానికి అర గంట ముందు అంటే, 8.30 గంటలకు క్యాంపస్‌లో కరెంట్ పోయింది.

జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషనే విద్యుత్‌ను నిలిపివేసినట్టు విద్యార్థులు ఆరోపించారు. స్క్రీనింగ్‌కి ముందు కరెంట్ పోవడంపై జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ స్పందించలేదు.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

దీనిపై రాత్రి 9.10 గంటలకు మొబైల్ ఫోన్ లైట్ సాయంతో డాక్యుమెంటరీని చూసేందుకు వచ్చిన విద్యార్థులను ఉద్దేశించి జేఎన్‌యూ విద్యార్థి సంఘ అధ్యక్షుడు ఐషే ఘోష్ మాట్లాడారు.

''నిజం బయటికి వస్తుందని వారు భయపడుతున్నారు. మీరు మా నుంచి వెలుతురుని తీసుకోవచ్చు. మా చేతుల నుంచి స్క్రీన్‌ని లాగేసుకోవచ్చు. మా ల్యాప్‌టాప్‌లను కూడా తీసేసుకోవచ్చు. కానీ మా కళ్లను మాత్రం మీరు తీసుకోలేరు, అవే మా స్ఫూర్తి’’ అని ఐషే ఘోష్ అన్నారు.

''మోదీ ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను ఆపవచ్చు. కానీ, ప్రజలు చూడకుండా మాత్రం ఆపలేరు’’ అని ఐషే ఘోస్ బీబీసీతో అన్నారు.

బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్’ సోషల్ మీడియాలో షేర్ కాకుండా లింక్‌లను ట్విటర్, యూట్యూబ్‌ల నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని తొలగించాలని ఆదేశించిన తర్వాత, జేఎన్‌యూ విద్యార్థి సంఘం దీన్ని చూడాలని నిర్ణయించింది.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

చీకట్లోంచి విద్యార్థులపై రాళ్ల దాడి

కరెంట్ పోవడంతో డాక్యుమెంటరీని విద్యార్థులు పెద్ద స్క్రీన్లపై చూడటం కుదరలేదు. దీంతో విద్యార్థి సంఘానికి చెందిన వ్యక్తులు ఏ4 సైజు పేపర్‌పై ప్రింట్ చేసిన క్యూఆర్‌ కోడ్‌ను విద్యార్థులకు అందించి, దాని ద్వారా వారి ఫోన్లలో డాక్యుమెంటరీని చూసేలా సాయం చేశారు.

విద్యార్థి సంఘానికి చెందిన కార్యాలయం వెలుపల కార్పెట్‌పై కూర్చుని డాక్యుమెంటరీ చూడాలనుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. కానీ, ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఫోన్లలో చూడటానికి విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. దీంతో కొంత మంది విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని చూసేందుకు ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు తీసుకొచ్చారు.

సుమారు 300 మంది విద్యార్థులు ఈ డాక్యుమెంటరీని చూసేందుకు విద్యార్థి సంఘానికి చెందిన కార్యాలయానికి వచ్చారు.

ఎలాంటి ఆందోళనలు జరగకుండా ఉండేందుకు దిల్లీ పోలీసులు కూడా సివిల్ డ్రస్‌లో వారిని ఒక కంట కనిపెట్టారు.

సివిల్ డ్రస్‌లో ఉన్న దిల్లీ పోలీసు సిబ్బంది రాత్రి 7 గంటలకు క్యాంపస్‌కు చేరుకున్నారు. కొందరు భద్రతా సిబ్బంది చేతుల్లో దిల్లీ పోలీసు క్యాపులు కనిపించాయి.

రాత్రి 9.40 గంటలకు విద్యార్థి సంఘానికి చెందిన కార్యాలయం బయట చిన్న చిన్న సమూహాలుగా విద్యార్థులు గుమ్మికూడి, బీబీసీ డాక్యుమెంటరీ 'ఇండియా: ది మోదీ క్వశ్చన్’ను ల్యాప్‌టాప్‌లలో చూశారు.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

ఆరు, ఏడు సమూహాలుగా ఏర్పాటై, ఈ డాక్యుమెంటరీని తిలకించారు.

కొందరు తమ ల్యాప్‌టాప్‌లను నేలపై పెట్టి, కొందరు బైకులు, కొందరు చైర్‌లపై పెట్టి ఈ డాక్యుమెంటరీని చూశారు.

కొందరు విద్యార్థులు తమ ల్యాప్‌టాప్‌లకు పెద్ద స్పీకర్లను కూడా కనెక్ట్ చేశారు.

డాక్యుమెంటరీ చూస్తున్న విద్యార్థులపై కొందరు వ్యక్తులు రాత్రి 10.20 గంటలకు రాళ్లు రువ్వారు.

సమీపంలోని తెఫ్లాజ్ క్యాంటీన్ దగ్గర్నుంచి ఈ రాళ్లను విసిరారు.

రాళ్లతో పాటు ఇటుకలను కూడా విసిరారు. రాళ్లు రువ్వడం ప్రారంభించిన తర్వాత, విద్యార్థుల మధ్యలో తొక్కిసలాట చోటు చేసుకుంది. విద్యార్థులు డాక్యుమెంటరీని మధ్యలోనే చూడటం ఆపివేసి, రాళ్ల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తారు.

ఐదు నిమిషాల్లోనే విద్యార్థి సంఘం కార్యాలయమంతా ఖాళీ అయిపోయింది.

ఆ తర్వాత విద్యార్థులందరూ కలిసి మార్చ్ చేసుకుంటూ జేఎన్‌యూ ప్రధాన గేటు వద్దకు వచ్చి, నినాదాలు చేశారు.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

జేఎన్‌యూలో విద్యార్థులపై రాళ్లు

విద్యార్థి సంఘ కార్యాలయానికి 500 మీటర్ల దూరంలో జేఎన్‌యూ ప్రధాన గేటు ఉంది. రాత్రి 11 గంటలకు విద్యార్థులు గంగా దాబాను దాటి ప్రధాన గేటు వద్దకు చేరుకునే సమయంలో మరోసారి విద్యార్థులపై రాళ్లు విసిరారు కొందరు వ్యక్తులు.

గంగా దాబా వైపు నుంచి 20 నుంచి 30 మంది విద్యార్థుల గుంపు వారిపై రాళ్లు రువ్వింది.

రాళ్లు విసిరిన వారిని పట్టుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించగా.. వారు చెట్ల పొదలోకి వెళ్లి దాక్కున్నారు.

''షూస్ వేసుకుని వారు నన్ను తన్నారు. నన్నెందుకు తన్నుతున్నారని నేను వారిని అడిగాను. మీరు ముందుకు కదలండి అంటూ కొడుతూనే ఉన్నారు’’ అని ప్రవీణ్ అనే విద్యార్థి చెప్పారు.

''నేను హాస్టల్‌కి వెళ్తున్న సమయంలో ఐదు నుంచి ఆరుగురు వ్యక్తులు ఒక అబ్బాయిని కొడుతూ కనిపించారు. అక్కడ సెక్యూరిటీ గార్డులు నిల్చుని ఉన్నారు. అక్కడేం జరుగుతుందో చూడడంటూ నేను వారికి చెప్పాను. వెంటనే ఒక అబ్బాయి నా వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చి, నా ముఖంపై తన్నాడు’’ అని మరో జేఎన్‌యూ విద్యార్థి బీబీసీకి తెలిపారు.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

రాళ్లు రువ్విందెవరు?

జేఎన్‌యూ ప్రధాన గేటు వద్ద రెండు మూడు సార్లు విద్యార్థులపై రాళ్లు రువ్వారు. రాళ్లు విసిరిన వ్యక్తులు తమ ముఖాలు కనిపించకుండా ఉండేందుకు మాస్క్‌లను పెట్టుకుని, వస్త్రాలను కట్టుకున్నారు.

ఫోన్ల టార్చ్ లైటును ఆన్‌ చేయొద్దని కొందరు విద్యార్థులు అరుస్తూ చెప్పారు.

ఆ సమయంలో జేఎన్‌యూ భద్రతా సిబ్బంది అక్కడే ఉన్నారు. కానీ, వారేం చేయలేదు. కొంతసేపటికి జేఎన్‌యూ క్యాంపస్ నుంచి భద్రతా సిబ్బంది కూడా బయటికి వెళ్లిపోయింది.

పలు వాహనాల్లో దిల్లీ పోలీసులు క్యాంపస్ బయట నిల్చున్నప్పటికీ, వారు ఏం మాట్లాకుండా అలానే ఉన్నారు.

జేఎన్‌యూ ప్రధాన గేటు వద్ద విద్యార్థులు దిల్లీ పోలీసులు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ''ఈ సమయంలో కరెంట్ ఇవ్వాలి. డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌ను ఆపేందుకు రాళ్లు రువ్వేంత స్థాయికి జేఎన్‌యూ అడ్మినిస్ట్రేషన్ దిగజారుతుందని మేమసలు ఊహించలేదు’’ అని ఐషే ఘోష్ అన్నారు.

ఏబీవీపీ(అఖిల భారతీయ విద్యార్థి పరిషత్)కి చెందిన వ్యక్తులు రాళ్లు విసరడాన్ని తాము చూసినట్టు జేఎన్‌యూ అధ్యక్షుడు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను బీబీసీ స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

జేఎన్‌యూ అధ్యక్షులు చేసిన ఈ ఆరోపణలపై ఏబీవీపీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

మరోసారి ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నామని జేఎన్‌యూ విద్యార్థి సంఘం తెలిపింది. అదేవిధంగా జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ డాక్యుమెంటరీని జనవరి 25న ప్రదర్శించనున్నట్టు చెప్పింది.

బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శన

రెండు ఎపిసోడ్‌ల డాక్యుమెంటరీ

బీబీసీ రెండు ఎపిసోడ్‌లతో 'ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీకి తొలి ఎపిసోడ్ జనవరి 17న బ్రిటన్‌లో విడుదలైంది.

తొలి ఎపిసోడ్‌లో నరేంద్ర మోదీ తొలినాళ్ల రాజకీయ జీవితాన్ని ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీలో సాధారణ నేత నుంచి నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే దశలను ఇందులో చిత్రీకరించారు.

బ్రిటీష్ విదేశీ కార్యాలయం నుంచి ప్రచురితం కాని ఒక నివేదికను ఆధారంగా చేసుకుని బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది.

ఈ డాక్యుమెంటరీలో నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2002లో జరిగిన అల్లర్లలో సుమారు 2 వేల మంది మరణించడంపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.

గుజరాత్‌లో 2002లో హింసాత్మక పరిస్థితులు తలెత్తడానికి నేరుగా మోదీయే బాధ్యుడని బ్రిటీష్ విదేశీ కార్యాలయ నివేదిక పేర్కొంది.

అయితే, ఈ అల్లర్లకు తానే బాధ్యుడని వస్తున్న ఆరోపణలను మోదీ ఖండిస్తూ వస్తున్నారు. బ్రిటీష్ విదేశీ మంత్రిత్వ శాఖకు ఈ నివేదిక అందజేసిన బ్రిటీష్ దౌత్యవేత్తతో బీబీసీ మాట్లాడింది. ఆయన తన నివేదికకు కట్టుబడి ఉన్నారు.

గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోదీ ప్రమేయంపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది.

పాత్రికేయుల సమావేశంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ, ''అపఖ్యాతిని అంటగట్టేందుకు రూపొందించిన కథనంగా ఈ డాక్యుమెంటరీని మేం భావిస్తున్నాం. ప్రజలు ఇప్పటికే కొట్టిపారేసిన దానికి దుష్ఫచారాన్ని కలిగించడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు. అది చేశారు’’ అని ఆయన అన్నారు.

వలసవాద మనస్తత్వంతో, దుష్ఫచారంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు ప్రభుత్వానికి చెందిన చాలా మంది అంటున్నారని బ్రిటీష్ ప్రధాన మంత్రి రిషి సునాక్ చెప్పారు. పూర్తి విచారణ తర్వాతనే బీబీసీ ఎడిటోరియల్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు బీబీసీ స్పష్టం చేసింది.

కేరళలోని కొన్ని క్యాంపస్‌లు కూడా ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించాయి. వివిధ యూనివర్సిటీ క్యాంపస్‌లకు చెందిన విద్యార్థి సంఘాలు కూడా ఈ డాక్యుమెంటరీని విద్యార్థులు చూసే ప్రదర్శిస్తామని తెలిపాయి.

హెచ్‌సీయూ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదం...

హైదరాబాద్ నుంచి బళ్ల సతీశ్, బీబీసీ ప్రతినిధి

క్యాంపస్ ఫేటర్నిటీ గ్రూప్ అనే సంస్థకు చెందిన విద్యార్థులు కొందరు హెచ్‌సీయూ క్యాంపస్‌లోని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి ఈ డాక్యమెంటరీని ప్రదర్శించారు. దాదాపు వంద మంది వరకూ ఈ ప్రదర్శన చూశారని బీబీసీతో చెప్పారు విద్యార్థి సంఘ నాయకులు.అయితే ఈ ప్రదర్శనకు విద్యార్థులు ఎటువంటి ముందస్తు అనుమతులూ తీసుకోలేదు. ''సాధారణంగా ఈ ప్లేస్ లో ఇటువంటి కార్యక్రమాలు, చర్చలు, ప్రదర్శనలు నిర్వహిస్తుంటాం. కాబట్టి దానికి ముందస్తు అనుమతి అవసరం లేదు.’’ అని బీబీసీతో అన్నారు యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షులు అభిషేక్.

అయితే, క్యాంపస్ లో ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ముందస్తు అనుమతి కావాలని యూనివర్సిటీ యాజమాన్యం చెబుతోంది. ''స్క్రీనింగ్ గురించి మాకు సమాచారం రాగానే, భద్రతా సిబ్బంది, స్టూడెంట్స్ వెల్ఫేర్ విభాగం డీన్ అక్కడకు వెళ్లారు. స్క్రీనింగ్ ఆపాలని కోరారు. కానీ విద్యార్థులు మా మాట వినకుండా కొనసాగించారు.

యూనివర్సిటీ నిబంధనల ప్రకారం విద్యార్థి సంఘాలు నిర్వహించే అన్ని కార్యక్రమాలకూ ముందస్తు అనుమతి తప్పనిసరి. అనుమతి లేకుండా ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం నిబంధనలు ఉల్లంఘించడమే. దీనిపై మేం నివేదిక కోరాం. నివేదిక రాగానే తగు చర్యలు తీసుకుంటాం. మిగతా అంతా ప్రశాంతంగా జరిగింది. యూనివర్సిటీలో ఏ అవాంఛనీయ సంఘటనలూ జరగలేదు’’ అని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.

''యూనివర్సిటీ అధికారులు స్క్రీనింగ్ ఆపాలని కోరారు. భారత ప్రభుత్వం డాక్యుమెంటరీని నిషేధించలేదు. ఏ కోర్టూ దాన్ని నిషేధించలేదు. ఇక ప్రదర్శన ఆపమని ఎలా కోరతారని మేం ఎదురు ప్రశ్నించాం’’ అని విద్యార్థి నాయకులు చెప్పారు.

శనివారం డాక్యుమెంటరీ స్క్రీనింగ్ ప్రశాంతంగా ముగిసినప్పటికీ, మంగళవారం దీనిపై వివాదం చెలరేగింది. ఈ డాక్యుమెంటరీని భారత ప్రభుత్వం నిషేధించిందనీ, కాబట్టి దాన్ని క్యాంపస్ లో ప్రదర్శించడం సరికాదంటూ యూనివర్సిటీ అధికారులకు ఏబీవీపీ విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసింది.

''ఈ డాక్యుమెంటరీ భారతదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉంది. భారతదేశ పరువు తీసేందుకే దీన్ని తీశారు. భారతదేశంలో, తెలంగాణలో బీబీసీ లోగో ఎక్కడ కనిపించినా తరిమి తరిమి కొడతాం. భారతదేశంలో మీడియా స్వేచ్ఛ లేదని బీబీసీ అంటోంది కదా. మీడియా స్వేచ్ఛ లేకుండా ఉక్కుపాదం మోపితే ఎలా ఉంటుందో వారికి చూపిస్తాం’’ అని ఏబీవీపీకి చెందిన మహేశ్ నామాని మీడియాతో చెప్పారు.

కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిణామాలపై పోలీసులకు సమాచారం ఉంది. అయితే, ఎవరూ ఇప్పటి వరకూ దీనిపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Protests at Hyderabad Central University, and Delhi's JNU over screening of BBC documentary on Modi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X