Puducherry Exit Poll 2026: మళ్ళీ ‘రంగ’నాథుడిదే హవా!
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మరోసారి ఎన్‌డీఏ కూటమి జయకేతనం ఎగురవేయబోతోంది. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం.. ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో, అధికారానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 16-17 కాగా.. ఎన్‌డీఏ కూటమి 16 నుండి 19 స్థానాలను కైవసం చేసుకోబోతోంది. ప్రత్యర్థి సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి 10-12 స్థానాలకే పరిమితం కానుండగా, ఇతరులు 1-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది.
ఎగ్జిట్ పోల్ లెక్కల ప్రకారం ఓట్ల శాతం:
పీపుల్స్ పల్స్ విడుదల చేసిన గ్రాఫిక్ నివేదిక ప్రకారం ఓట్ల చీలిక ఇలా ఉండబోతోంది:
- NDA (BJP+): 34% - 36%
- SPA (Congress+): 30% - 32%
- TVK + NMK: 15% - 17%
- NTK: 4% - 6%
- VCK: 1% - 3%
- ఇతరులు: 2% - 5%

కూటమిలో పార్టీల వారీగా సీట్ల అంచనా:
ఎన్‌డీఏ కూటమిలో సీఎం రంగస్వామికి చెందిన ఏఐఎన్ఆర్‌సి (AINRC) 10-12 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. బీజేపీ 5-6 స్థానాలు, ఎల్‌జేకే 1-2, ఏఐఏడీఎంకే 0-1 స్థానాలను గెలుచుకోవచ్చు. అటు ఎస్‌పీఏ కూటమిలో డీఎంకే 6-8 స్థానాలు సాధిస్తుండగా, కాంగ్రెస్ కేవలం 1-3 స్థానాలకే పరిమితం కాబోతోంది. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే మరియు ఇతరులు కలిసి 1-2 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే తేల్చింది.
రంగస్వామి చరిష్మా.. కేంద్రం అండ!
పుదుచ్చేరి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు అవసరమని 65 శాతం మంది ఓటర్లు అభిప్రాయపడటం ఎన్‌డీఏకు కలిసొచ్చింది. దాదాపు 68 శాతం మంది ప్రజలు ఎన్. రంగస్వామినే తదుపరి ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనపై 60 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తూ, మరోసారి అవకాశమిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి విషయంలో ఏఐఎన్ఆర్‌సికి 56 శాతం మద్దతు లభించగా, కాంగ్రెస్‌కు కేవలం 24 శాతం మద్దతు మాత్రమే దక్కింది.














Click it and Unblock the Notifications