Opinion:పంజాబ్‌లో మోడీ - షా మంత్రం ఫలిస్తుందా: ఒంటరిగా బరిలోకి: సిక్కు నేతలు కరువు
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీంతో ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలు గ్రౌండ్ వర్క్ చేయడంతో పాటు యాక్టివ్ రోల్ పోషిస్తున్నాయి. అధికారం చేజిక్కించుకునేందుకు అన్ని వ్యూహాలను సిద్ధం చేయడంతో పాటు అమలు కూడా చేస్తున్నాయి. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళుతున్నాయి. అదే సమయంలో అధికార పార్టీ కూడా గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. ఇక వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల్లో పంజాబ్ ఒక రాష్ట్రంగా ఉంది. అయితే అక్కడ బీజేపీది ప్రస్తుతం ఒంటరి ప్రయాణంగానే కనిపిస్తోంది.
వచ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ - బీజేపీ మధ్య ప్రధాన పోటీ జరగనుంది. అంతకు ముందు కాంగ్రెస్- ఎన్డీయే కూటమి మధ్య పోటీ జరిగేది. అయితే ఈ సారి శిరోమణి అకాళీదల్ బీజేపీ నుంచి బయటకు వచ్చేయడంతో కాషాయం పార్టీ ఒంటరి పోరు తప్పడం లేదు. వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గతేడాది సెప్టెంబరులో శిరోమణి అకాళీదల్ బీజేపీతో కటీఫ్ చెప్పేసింది. దీంతో గత 25 ఏళ్లల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. ఇక పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకునేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు బాగా తెలిసి పరిచయం ఉన్న సిక్కు నేతల కోసం బీజేపీ జల్లెడ పడుతోంది.

పంజాబ్‌లో ప్రస్తుతం బీజేపీకి మూడు ప్రధాన సమస్యలున్నాయి. పంజాబ్‌లో బీజేపీకి రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఈ రైతుల్లో మెజార్టీ సిక్కులున్నారు. అయితే నియోజకవర్గ స్థాయిలో బీజేపీకి సిక్కు నేతలు లేరు. ఇక 117 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుండగా వారికి సిక్కు నేతలు కరువయ్యారు. ఇక కాంగ్రెస్ నేత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను ఢీకొట్టే స్థాయిలో బీజేపీ నుంచి ఒక్క నేత కూడా కనిపించడంలేదు. అదే సమయంలో శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాష్ సింగ్ బాదల్ కూడా బలంగానే కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ బీజేపీ పెద్దలు పంజాబ్ బీజేపీ నేతలను హస్తినకు పిలిపించుకుని చర్చలు ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవ్వాలో రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక బీజేపీ అపర చాణక్యుడు అమిత్ షా ఈ సమావేశంలో పాల్గొని ప్రతి నియోజకవర్గంలో 300 నుంచి 400 మంది కమిటెడ్ పార్టీ కార్యకర్తలను గుర్తించాలని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు సిక్కు సామాజిక వర్గంకు చెందిన మేధావులను పార్టీలో చేర్చుకోవాలని అమిత్ షా కమలనాథులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జూన్ 16వ తేదీన పలువురు సిక్కు మేధావులను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. సాగు చట్టాలపై రైతులు ఇంత వ్యతిరేకత వ్యక్తం చేస్తామని ఊహించలేదని.. అదే సమయంలో శిరోమణి అకాలీదళ్ పార్టీ కేబినెట్ నుంచి బయటకు వస్తుందని అనుకోలేదని పంజాబ్ బీజేపీ నేత ఒకరు చెప్పారు. ఎన్నికలు జరిగేలోగా ఈ సమస్యను పరిష్కరించకపోతే ఎన్నికల్లో గెలవడం కష్టతరమే అవుతుందని ఆయన వెల్లడించారు.
1997 నుంచి అంటే శిరోమణి అకాలీదళ్‌తో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి సిక్కు ఓట్ల కోసం బీజేపీ ఏనాడు పాకులాడాల్సిన పనిరాలేదు. ఎందుకంటే సిక్కు ఓటర్లు శిరోమణి అకాళీదల్‌తో ఉన్నారు. ఆ సమయంలో దళితులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా దళితులను ప్రోత్సహించడం పెట్టింది. ప్రస్తుతం పంజాబ్‌కు చెందిన దళిత నేత సోమ్ ప్రకాష్ కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి విజయ్ సంప్లా ప్రస్తుతం జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక శిరోమణి అకాళీదల్ పార్టీ వైపు జాట్ సామాజిక వర్గం ఉంది. వీరు పంజాబ్ జనాభాలో 25శాతంగా ఉన్నారు. దళితులు 32శాతం ఉండగా బీజేపీ ఈ సామాజికవర్గంను దువ్వుతోంది. పట్టణ ప్రాంతాల్లో మాత్రం హిందుత్వా ఓటు బ్యాంకుపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం రైతులను శాంతించే పనిలో ముఖ్యంగా సిక్కు రైతులను శాంతింపజేసే పనిలే బీజేపీ నిమగ్నమైంది.
ఇక సిక్కులను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఏ అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునేందుకు డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ తయారు చేసిన పుస్తకంను ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ సిక్కు కుటాంబాలకు పంచిపెట్టాలని రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం సూచించింది. అంతేకాదు జిల్లా నాయకులు స్వయంగా ఆ కుటుంబాలు నివసిస్తున్న ఇళ్లకు వెళ్లి పుస్తకాన్ని పంచిపెడతారు. ఆ తర్వాత ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తద్వారా రైతులు బీజేపీకి వ్యతిరేకంగా లేరనే సంకేతాలు పంపాలని యోచిస్తోంది. ఆ పుస్తకంలో ప్రధాని నరేంద్ర మోడీకి సిక్కులకు ఉన్న అనుబంధం గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేకాదు కాంగ్రెస్ హయాంలో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి కూడా ప్రస్తావిస్తూ పలు అంశాలను పుస్తకంలో గుర్తు చేశారు.ఇక మోడీ హయాంలో గురు నానక్ 550వ జయంతి సందర్భంగా కర్తాపూర్ కారిడార్ పూర్తి చేయడం వంటివి పుస్తకంలో ప్రస్తావించారు.
మొత్తానికి పంజాబ్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ చేసింది. అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఒంటరిగా పోటీచేయాల్సి రావడం, రైతు వ్యతిరేకత ఉండటంతో ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications