
Punjab elections 2022:పురుడు పోసుకున్న మరో పార్టీ, రైతు నేత నాయకత్వం
పంజాబ్ ఎన్నికలపై దాదాపు అన్నీ రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ఎన్నికల్లో గెలవాలని తమ వ్యుహాలకు పదును పెట్టాయి. ఈలోపు పార్టీలు కూడా పుట్టుకు వస్తున్నాయి. అవును మాజీ సీఎం అమరీందర్ సింగ్ పార్టీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అదే బాటలో రైతు నేత గుర్నామ్ సింగ్ చాదుని నడుస్తున్నారు. ఆయన కూడా ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో తాము కూడా బరిలో ఉన్నానని సంకేతాలను ఇచ్చారు.

బరిలో దిగ..
గుర్నామ్ సింగ్.. సంయుక్త్ కిసాన్ మోర్చాలో సభ్యులు కూడా.. ఆయన శనివారం చండీగడ్‌లో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తమ పార్టీ పేరు సంయుక్త్ సంఘర్ష్ పార్టీ అని మీడియాకు తెలియజేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తెలియజేశారు. ప్రజలకు సంక్షేమ పాలన అందించడమే తమ ధ్యేయం అని వివరించారు. వ్యవసాయ చట్టాలు కార్పొరేట్లకు ఎర్ర తివాచీ పరుస్తాయని విమర్శించారు. సమాజంలో దిగువ తరగతి ప్రజల అభివృద్ది తమ లక్ష్యం అని తెలియజేశారు.తమ పార్టీ రాష్ట్రంలో గల 117 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని తెలియజేశారు. తాను మాత్రం బరిలో దిగనని స్పష్టంచేశారు.

ఇటు పొత్తులు
ఇటు బీజేపీతో కలిసి పోటీ చేస్తామని మాజీ సీఎం, పంజాబ్ లోక్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ స్పష్టంచేశారు. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు సీట్ల సర్దుబాటును చేపడతాయని అమరీందర్ ట్వీట్ చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో 101 శాతం తాము విజయం సాధిస్తామని కెప్టెన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. అమరీందర్ సింగ్‌తో భేటీ తర్వాత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఓ ట్వీట్ చేశారు. ఏడు రౌండ్ల చర్చల తర్వాత తమ పొత్తు ఖాయం అయ్యిందని ఆయన చెప్పారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయని స్పష్టం చేశారు.

సీట్ల పంపిణీ లేదు..
సీట్ల పంపిణీ ఇంకా జరగలేదని.. అయినప్పటికీ ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం పక్కా అని షెకావత్ తెలిపారు. సీట్ల పంపకం అనేది విజయాన్ని బట్టి ఉంటుందని అమరీందర్ సింగ్ తెలియజేశారు. తమ కూటమి విజయం తథ్యం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడకముందే అమరీందర్ సింగ్ బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారు. 40 ఏళ్ల పాటు కలిసి పనిచేసిన పార్టీని చివరికీ వీడారు.