పంజాబ్ లో కొత్త సమీకరణాలు - ఆప్ కీలకం కానుందా : ఎవరు ఎవరితో కలుస్తారు..!!
మరి కొద్ది గంటల్లో పంజాబ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. త్రిముఖ పోటీలో ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నా... సమీకరణాలు మాత్రం ఆసక్తి కరంగా ఉన్నాయి. మొత్తం 117 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకొనేందుకు రాజకీయంగా అనేక వ్యూహాలను తెర మీదకు తెచ్చింది. అయితే, ఈ ఎన్నికల్లో ఇప్పుడు ఆప్ ప్రభావం ఏ మేర అనే చర్చ ఆసక్తి కరంగా మారింది. ఆప్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆ పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది.

క్రమేణా ఎదిగిన ఆప్
2017 అసెంబ్లీ ఎన్నికల్లో 23.17 శాతం ఓట్లతో 20 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కానీ, 2019 లో మాత్రం పంజాబ్ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా ఆప్ కు ఇవ్వలేదు. కానీ, ప్రస్తుత ఎన్నికలు లక్ష్యంగా ఆప్ అందరి కంటే ముందు నుంచే రేసులో నిలిచింది. అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహా పాలనను అందిస్తామని, ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని ఆప్ ప్రచారం చేస్తూ వచ్చింది. అదీ కాకుండా ఢిల్లీలో విద్య, వైద్య రంగాలలో కేజ్రీవాల్ తీసుకొచ్చిన మార్పులు.. ప్రయోజనాల గురించి ప్రజల్లో చర్చల స్థాయికి తీసుకెళ్లగలిగింది. పంజాబ్ లో 45 శాతం మంది మహిళా ఓటర్లు ఉండటంతో..వారిని ఆకట్టుకొనేందుకు 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది.

కాంగ్రెస్ కు అసలు సమస్య అదే
పంజాబ్ ప్రజలు కాంగ్రెస్ పాలనను చూశారు. అకాలీల పాలననూ చూశారు. ఈ రెండు ప్రభుత్వాలతో విసుగెత్తిపోయిన పంజాబ్ ప్రజలకు ఆప్ కు అవకాశం ఇవ్వాలని నినాదంగా ముందుకెళ్లారు. అయితే, ఆప్ కు బలమైన క్యాడర్ లేదు. గత అయిదేళ్లలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టారు. ఇక...కాంగ్రెస్ లో సీఎం చన్నీ..పీసీసీ అధ్యక్షుడు సిద్దూ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. పంజాబ్‌లో 32 శాతం మంది దళితులు ఉండటం, చన్నీ దళితుడు కావడం కాంగ్రెస్‌కు అనుకూలిస్తున్న అంశం. అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇక, చన్నీ సీఎం అయిన తరువాత వేగంగా తీసుకొన్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఓట్లుగా మారుతాయనే నమ్మకంతో కాంగ్రెస్ కనిపిస్తోంది.

భారీ అంచనాలతో కాషాయ నేతలు
బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కూటమి ప్రభావం ఏ స్థాయిలో ఉందనే దాని పైన భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రధాని మోదీ సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. ఇక్కడ బలంగా నాలుగు పార్టీలు పోటీలో ఉన్నా..చివరకు ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారు..ఎవరికి పట్టం కడతారనేది మాత్రం వచ్చే నెల 10వ తేదీన తేలనుంది. ఓటింగ్ సరళి పరిశీలిస్తే కొం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications