ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్లు బంద్ -ప్రభుత్వమే అమ్ముకుంటోందని విమర్శలు రావడంతో..
తయారీదారుల నుంచి వ్యాక్సిన్లను తక్కువ ధరకు సేకరించే కేంద్రం.. కొంత లాభాన్ని ఉంచుకుని.. వాటిని రాష్ట్రాలకు సరఫరా చేస్తుండగా, తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా సదరు వ్యాక్సిన్లను ఇంకొంత లాభానికి ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటున్నాయి రాష్ట్రాలు. వెరసి ప్రజలకు చేరాల్సిన ఉచిత వ్యాక్సిన్లు పూర్తి వ్యాపారంగా మారిపోయాయి. దేశంలో వ్యాక్సిన్ల కొరత నెలకొన్నవేళ సరఫరాను క్రమబద్దీకరించాల్సిన ప్రభుత్వాలే అడ్డదారుల్లో అమ్మకాలకు పాల్పడుతోన్న విచిత్ర పరిస్థితి పంజాబ్ లో నెలకొంది. ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు రావడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ల పంపిణీని పూర్తిగా ఆపేసింది పంజాబ్ సర్కార్. వివరాలివి..
వ్యాక్సిన్లను అక్రమంగా ప్రైవేటు ఆస్పత్రులకు విక్రయిస్తున్నారంటూ ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురైన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సినేషన్ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. 18-44 సంవత్సరాలవారికి డబ్బులు చెల్లించి ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు కేంద్రం అనుమతివ్వగా, కేంద్రం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వం అధిక ధరకు ప్రైవేటు ఆస్పత్రులకు అమ్ముకుంటోందని ప్రతిపక్ష అకాలీదళ్ ఆరోపించింది.

కేంద్రం నుంచి రూ. 400 కొన్న వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు రూ.1060కి అమ్ముతోందని, తిరిగి వాళ్లు ప్రజలకు రూ. 1560కి వ్యాక్సిన్ వేస్తున్నారని అకాళీదల్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ గురువారం ఆరోపణలు చేసిన నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ శుక్రవారం చర్యలకు ఉపక్రమించింది. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్ సరఫరా నిలిపివేయడంతోపాటు, ఇప్పటికే వివిధ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న వ్యాక్సిన్లను తిరిగి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
వ్యాక్సిన్ ఫండ్ కింద ఆస్పత్రులు జమ చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పింది. అంతేకాకుండా వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసిన వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వానికి ఇచ్చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఆదేశాలు వెలువడక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఆరోగ్యశాఖ లేఖ రాసింది. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీరుతెన్నుల గురించి సమగ్రంగా వివరించాలని కోరింది.
సుఖ్‌బీర్ బాదల్ విమర్శలపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి బీ.ఎస్. సిధూ స్పందించారు. ''టీకాల విషయంలో నియంత్రణ లేదు. ఆ వ్యవహారం నేను చూడటం లేదు. కరోనా చికిత్స, కరోనా పరీక్షలు, వ్యాక్సినేషన్ కేంద్రాలపై ప్రస్తుతం దృష్టి సారించాను. బాదల్ చేసిన ఆరోపణలపై కచ్చితంగా విచారణ జరిపిస్తాం. నేను స్వయంగా చూస్తాను'' అని ఆరోగ్య మంత్రి బీఎస్ సిధూ ప్రకటించారు.












Click it and Unblock the Notifications