పోటీ చేయను: విభజనపై డిగ్గీకి పురంధేశ్వరి ఘాటు లేఖ
న్యూఢిల్లీ: కాంగ్రెసు అధిష్టానంపై కేంద్ర మంత్రి, విశాఖపట్నం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని చెప్పారు. ఈ మేరకు ఆమె కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌కు ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్ర విభజన విషయంలో తమ అభిప్రాయాన్ని పట్టించుకోలేదని, పార్టీ వైఖరితో తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని ఆమె ఆ లేఖలో అన్నారు.
సిట్టింగ్ ఎంపినైన తనను విశాఖపట్నం నుంచి మారాలని చెబుతున్నారని ఆమె అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై తమతో చర్చించలేదని ఆమె అన్నారు. ఎంత అన్యాయం చేసినా తాము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని అన్నారు. తమ గొంతులు కేసి మంటల్లో పడేశారని ఆమె వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని అడిగితే పట్టించుకోలేదని అన్నారు. విశాఖ రైల్వే జోన్ విషయాన్ని కూడా పట్టించుకోలేదని ఆమె అన్నారు.

సిట్టింగ్ ఎంపిగా ఉన్నవారిని ఏ తప్పు చేయకున్నా నియోజకవర్గం మారాలని అడగడం ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమేనని ఆమె అన్నారు. సీమాంధ్ర ప్రజల వద్ద తమ దోషులుగా నిలబెట్టారని ఆమె అన్నారు. విభజనను ఏకపక్షంగా చేశారని ఆమె అన్నారు. అన్నీ దిగమింగుతూ పార్టీలో ఉంటే నియోజకవర్గం మారాలని ఎలా అంటారని, ఆత్మాభిమానం లేదని అనుకుంటున్నారా అని ఆమె అడిగారు.
శుక్రవారంనాడు ఆమె భర్త, ప్రకాశం జిల్లా పర్చూరు శాసనసభ్యుడు డాక్టర్ దగ్గుబాటి రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కార ఓటు వేసి సంచలనం సృష్టించారు. కాంగ్రెసు పార్టీ రాజ్యసభ అభ్యర్థులు కెవిపి రామచందర్ రావు, టి. సుబ్బిరామిరెడ్డిలకు ఆయన ఓటు వేయడం ఇష్టం లేక తిరస్కార హక్కును వినియోగించుకన్నారు.
ఈ నేపధ్యంలోనే దగ్గుబాటి దంపతులు కాంగ్రెసు పార్టీకి దూరమవుతున్నారనే వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓ పుస్తకం కూడా రాశారు.












Click it and Unblock the Notifications