ISKCON vs Puri: రథయాత్ర ఎప్పుడైనా చేయొచ్చా? లౌకిక సౌకర్యాల కోసం తిథులు మార్పా?
రథే తు వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే.. జగత్ రక్షకుడు, ఆపద్బాంధవుడు అయిన ఆ పూరీ జగన్నాథుడు ఏటా ఆషాఢ మాసంలో చెల్లెలు సుభద్ర, అన్న బలభద్రుడితో కలిసి రథమెక్కి భక్తకోటికి దర్శనమిచ్చే పవిత్ర ఘట్టం రథయాత్ర. శతాబ్దాలుగా వస్తున్న ఈ దివ్య సంప్రదాయం వెనుక సనాతన ధర్మం, పంచాంగ తిథులు దాగున్నాయి. అయితే, ప్రస్తుతం ఈ రథయాత్ర నిర్వహణ తేదీలపై అంతర్జాతీయ ఆధ్యాత్మిక సంస్థ 'ఇస్కాన్' (ISKCON), పూరీ 'శ్రీ జగన్నాథ్ ఆలయ పరిపాలన విభాగం' (SJTA) మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. శాస్త్రాల ప్రకారం కాకుండా ఇస్కాన్ తన ఇష్టమొచ్చిన రోజుల్లో రథయాత్రలు జరపడంపై పూరీ పీఠం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
అసలు వివాదం ఎక్కడ మొదలైంది?
హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, ముఖ్యంగా 'స్కంద పురాణం' ఆధారంగా ఏటా ఆషాఢ శుక్ల పక్ష విదియ (ద్వితీయ) తిథి నాడు మాత్రమే జగన్నాథ రథయాత్ర నిర్వహించాలి. ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలు కచ్చితంగా చాంద్రమాన క్యాలెండర్ (పంజిక) ప్రకారమే జరగాలని పూరీ ఆలయ బోర్డు స్పష్టం చేస్తోంది. కానీ, ఇస్కాన్ సంస్థ విదేశాలలో ఈ తిథులతో సంబంధం లేకుండా, తమకు నచ్చిన నెలల్లో రథయాత్రలు నిర్వహిస్తోంది. ఉదాహరణకు.. అమెరికాలోని హ్యూస్టన్‌లో నవంబర్ నెలలో, ముంబైలో వసంత పంచమి రోజున (శీతాకాలంలో) రథయాత్రలు జరిపారు. ఇలా కాలాలు, తిథులు మార్చడం శాస్త్ర విరుద్ధమని పూరీ పండితులు మండిపడుతున్నారు.

ఇస్కాన్ వాదన ఏంటి?
ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలలో తాము కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నామని, విదేశీ నగరాల్లో రథయాత్రలు నిర్వహించాలంటే అక్కడి మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులు (పర్మిషన్లు) కావాలని ఇస్కాన్ చెబుతోంది. సాధారణ రోజుల్లో (వారంతాల్లో కాకుండా) భారీ ఊరేగింపులకు విదేశీ ప్రభుత్వాలు ఒప్పుకోవని, అందుకే భక్తుల సౌకర్యం కోసం, ఎక్కువ మందికి స్వామివారి సందేశం చేరాలనే ఉద్దేశంతోనే శని, ఆదివారాలు లేదా అనుకూలమైన వాతావరణం ఉన్న రోజుల్లో యాత్రలు చేస్తున్నామని ఇస్కాన్ సమర్థించుకుంటోంది.
పూరీ రాజు, పండితుల ఆగ్రహం
లౌకిక సౌకర్యాల కోసం శతాబ్దాల నాటి పవిత్ర సంప్రదాయాలను మార్చడం అంటే ధర్మాన్ని వ్యాపార ఉద్దేశాలతో వాడుకోవడమేనని పూరీ పండితులు, ఆలయ బోర్డు కొట్టిపారేసింది. ఈ వివాదంపై గతంలో 2025 మార్చిలో భువనేశ్వర్‌లో ఇరువర్గాల పండితులు సమావేశమైనా ఎలాంటి ఫలితం లేదు. తాజాగా, ఇస్కాన్ జూలై 12న ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తాము తిథులు మార్చడం శాస్త్ర సమ్మతమేనని సమర్థించుకోవడంతో వివాదం ముదిరింది. ఈ ప్రకటన పూర్తిగా అబద్ధమని, భక్తులను తప్పుదోవ పట్టించేలా ఉందంటూ పూరీ ఆలయ బోర్డు జూలై 14న తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చింది.
పూరీ సంస్థానాధీశుడు గజపతి మహారాజా దిబ్యసింగ్ దేవ్ ఈ వ్యవహారంపై నేరుగా రంగంలోకి దిగారు. శంకరాచార్యులు, వైష్ణవాచార్యుల మద్దతుతో ఆయన జూలై 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలకు లేఖలు రాశారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విదేశాల్లో ఇష్టారాజ్యంగా మార్చకుండా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే, తాము ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, ఇకపై ఈ చర్చల్లో పాల్గొనబోమని ఇస్కాన్ గవర్నింగ్ బాడీ తేల్చి చెప్పేసింది.
ఒడిశాలో వెల్లువెత్తుతున్న నిరసనలు
పూరీ రాజు విజ్ఞప్తిని ఇస్కాన్ తిరస్కరించడంపై ఒడిశా ప్రజలు, స్థానిక సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 'కళింగ సేన', 'వి ఫర్ భువనేశ్వర్' వంటి సంస్థలు ఇస్కాన్‌కు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నాయి. ఒడిశా రాష్ట్రంలో ఇస్కాన్ కార్యకలాపాలను పూర్తిగా నిషేధించాలని న్యాయవాదులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంపై ఇస్కాన్ జాతీయ ప్రతినిధి యుధిష్ఠిర్ గోవింద దాస్ స్పందిస్తూ.. పూరీ ఆలయ బోర్డు పూర్తి ప్రకటనను తాము ఇంకా పరిశీలించాల్సి ఉందని వెల్లడించారు.














Click it and Unblock the Notifications