వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్వీన్ ఎలిజబెత్ 2: కోహినూర్ వజ్రం, హంసలు, డాల్ఫిన్స్‌.. కింగ్ చార్లెస్‌కు తల్లి నుంచి ఏం వస్తున్నాయి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
క్వీన్ ఎలిజబెత్ 2

బ్రిటన్‌ను సుదీర్ఘకాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్ 2 ఇటీవల కన్నుమూశారు. బ్రిటన్‌లో అత్యధిక సంపన్న మహిళల్లో ఆమె ఒకరు. ఆమెకు రాజ భవనాలతోపాటు భూములు కూడా వారసత్వంగా వచ్చాయి. కొన్ని ఊహించని, ప్రత్యేకమైన ఆస్తులు కూడా ముందుతరం నుంచి ఆమెకు అందాయి. ఆమె అనంతరం ఇప్పుడు అవన్నీ చార్లెస్‌కు బదిలీ అవుతున్నాయి.

బట్టలు

''క్వీన్, క్వీన్ తల్లి తమదైన వస్త్రాలతో కొత్త ఒరవడి సృష్టించాలని ఎప్పుడూ అనుకోరు. ఏ పనీ లేనివారే తమ స్టైల్‌తో ట్రెండ్ సెట్టర్‌లుగా మారాలని భావిస్తారు''అని 1953లో న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాయల్ డిజైనర్ సర్ నార్మన్ హార్ట్నెల్ చెప్పారు.

క్వీన్ ఎలిజబెత్ 2

ఎలిజబెత్ 2 రాణిగా బాధ్యతలు తీసుకునే సమయంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత కాలంలో తనదైన, హుందాగా కనిపించే వస్త్ర శైలితో పశ్చిమ దేశాల మహిళా నాయకులకు రాణి ఆదర్శంగా నిలిచారు.

రాణిగా పట్టాభిషేకం సమయంలో రెండున్నర అంగుళాల ఎత్తుండే హీల్స్, మోకాళ్ల కిందవరకు ఉండే స్కర్టును ఆమె వేసుకున్నారు. బట్టల వల్ల ఆమె గౌరవానికి ఎలాంటి భంగమూ కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించారు.

ఆమె పెట్టుకునే టోపీలు కూడా వస్త్రాలకు తగినవే ఉండేవి. హెడ్‌స్కార్ఫ్ లేదా టోపీ లేదా కిరీటం లేకుండా రాణి బయట కనిపించడం చాలా అరుదు. ఆమె కోసం ఎంపిక చేసే రంగులు కూడా ఆమెకు సరిగ్గా సరిపోయేవే ఉండేవి.

''నీలం'' రాణికి నచ్చిన రంగుగా చెబుతారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వెళ్లేటప్పుడు ఆమె ఆ రంగు బట్టలను వేసుకునేవారు.

రాణి బట్టలను ఇప్పుడు ఎక్కడ ఉంచుతారనే విషయంలో స్పష్టతలేదు. అయితే, క్వీన్ విక్టోరియాతోపాటు ప్రిన్సెస్ డయానా లాంటి ప్రముఖుల వస్త్రాలు మ్యూజియంలలో మనం చూడొచ్చు.

క్వీన్ ఎలిజబెత్ 2

హ్యాండ్‌బ్యాగ్స్

రాణి దగ్గర తప్పకుండా కనిపించే వాటిలో హ్యాండ్‌బ్యాగ్ ఒకటి.

తన బట్టలకు సరిపోయే హ్యాండ్‌బ్యాగ్‌ను క్వీన్ ఎప్పుడూ తనతో తీసుకెళ్లేవారు. ఆమె చివరి అధికారిక ఫోటోలోనూ ఆమె హ్యాండ్‌బ్యాగ్‌తో కనిపించారు.

ఆమె బ్యాగ్‌లను బ్రిటిష్ బ్రాండ్ లానెర్ ప్రత్యేకంగా సిద్ధంచేసేది. మొత్తంగా ఆమె దగ్గర 200 హ్యాండ్‌బ్యాగ్‌లు ఉన్నాయి. వీటి తాళ్లు పొడవుగా ఉంటాయి. ఆమె ప్రముఖులతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా కరచాలనం చేసేందుకు వీలుగా ఇవి ఉండేవి.

క్వీన్ ఎలిజబెత్ 2

''క్వీన్ ఒక అద్భుతమైన మహిళ. ఆమెకు చాలా మంది అభిమానులు ఉంటారు. ఆమెకు హ్యాండ్‌బ్యాగ్‌లు తయారుచేసేటప్పుడు ఆ విషయాలను మేం జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేవాళ్లం. ఒకసారి ఆమె మాతో మాట్లాడుతూ.. హ్యాండ్‌బ్యాగ్ చేతిలో లేకపోతే తన డ్రెస్సింగ్ పూర్తయినట్లు అనిపించదని అన్నారు''అని లానెర్ ప్రొపైటర్ గెరాల్డ్ బోడ్మ్ బీబీసీతో చెప్పారు.

అయితే, ఆ బ్యాగులో ఏముంటాయనే విషయంలో చాలా ఊహాగానాలు ఉన్నాయి. చర్చిలో ఇచ్చేందుకు ఆమె బ్యాగులో ఎప్పుడూ ఒక ఐదు పౌండ్ల నోట్ ఉంటుందని చెబుతారు. మరోవైపు లిప్‌స్టిక్, అద్దం కూడా ఉంటాయని మరికొందరు అంటారు. తన మనవళ్లతో మాట్లాడేందుకు ఒక మొబైల్ ఫోన్ కూడా ఉంటుందని చెబుతారు.

మరోవైపు హ్యాండ్‌బ్యాగ్ ద్వారా తన సేవకులకు క్వీన్ సంకేతాలు ఇస్తారని కూడా అంటారు. ఒకవేళ ఆమె బ్యాగును టేబుల్‌పై పెడితే, ఆ కార్యక్రమం ముగించాలని ఆమె భావిస్తున్నట్లు చెబుతారు.

క్వీన్ ఎలిజబెత్ 2

హంసలు, డాల్ఫిన్‌లు

ఇంగ్లండ్, వేల్స్‌లలోని తెల్లని హంసలన్నీ రాజ కుటుంబమే పరిరక్షిస్తుంది. దీని కోసం ప్రత్యేక నిబంధనలు కూడా తీసుకొచ్చినట్లు రాయల్ సొసైటీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ బర్డ్స్ వెల్లడించింది.

ఏటా థేమ్స్ నదిలోని హంసలను లెక్కించేందుకు ఒక సెన్సస్ కూడా చేపడతారు. అతిథులకు ఆహారంగా పెట్టేందుకు వీటి మాంసం అందుబాటులో ఉండేలా చూసేందుకు వీటి బాధ్యతలను రాజకుటుంబం చూసుకుంటూ వచ్చింది.

''ఇప్పుడైతే హంసలను ఎవరూ ఆహారంగా తీసుకోవడం లేదు. వాటిని జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాం''అని కింగ్ స్వాన్ మార్కర్ డేవిడ్ బార్బర్ చెప్పారు.

క్వీన్ హంసల పరిరక్షకుడిగా బార్బర్ 30ఏళ్లు పనిచేశారు. ఇప్పుడు ఆయన క్వింగ్ స్వాన్ మార్కర్‌గా మారారు.

తీరానికి మూడు మైళ్ల దూరంలోని డాల్ఫిన్లు కూడా రాజుకు చెందినవే. దీని కోసం 1324లో ఎడ్వర్డ్ 2 రాజుగా ఉండేటప్పుడు ఒక ఆదేశం జారీచేశారు. ''రాజ్యంలోని తిమింగళాలు కూడా రాజుకే చెందుతాయి''అని ఆ ఆదేశంలో పేర్కొన్నారు.

ఆ ఆదేశం ఇప్పటికీ చెలామణీలో ఉంది. ఇప్పటికీ తిమింగళాలు, డాల్ఫిన్లను ''ఫిషెస్ రాయల్''గా పరిగణిస్తారు.

రాణి మరణానంతరం హంసలు, డాల్ఫిన్‌లు వారతస్వంగా చార్లెస్‌కు అందుతాయి.

క్వీన్ ఎలిజబెత్ 2

గుర్రాలు

రాణికి శునకాలు అంటే చాలా ఇష్టం. ఆమె మొత్తంగా 30కిపైగా కుక్కలను పెంచుకున్నారు.

ఆమెకు శునకాలతోపాటు గుర్రాలన్నా అమితమైన ప్రేమ. ఆమె దగ్గర చాలా గుర్రాలున్నాయి.

ఎలిజబెత్ 2 నాలుగో పుట్టినరోజునాడు తాతయ్య జార్జ్ 5 నుంచి ఆమెకు పెగ్గీగా పిలిచే ఓ గుర్రం బహుమతిగా వచ్చింది. దీనిపైనే ఆమె గుర్రపుస్వారీ నేర్చుకున్నారు.

ఆ తర్వాత ఆమెకు వారసత్వంగా రేస్ హార్స్ బ్రీడింగ్ సెంటర్ రాయల్ స్టడ్ వచ్చింది. దీని నుంచి చాలా గుర్రాలు వచ్చాయి.

అక్కడి ట్రైనర్ సర్ మైఖెల్ స్టౌట్ మొత్తంగా 100కుపైగా గుర్రాలను పర్యవేక్షించారు. ''రాణి కోసం గుర్రాలను సిద్ధం చేసేటప్పుడు ఎలాంటి ఒత్తిడీ ఉండేది కాదు. ఎందుకంటే ఆమెకు గుర్రాలపై మంచి అవగాహన, జ్ఞానం ఉన్నాయి''అని మైఖెల్ చెప్పారు.

''గుర్రాల దగ్గరకు వచ్చేటప్పుడు రాణి పర్ఫ్యూమ్‌ కొట్టుకునేవారు కాదు. ఎందుకంటే పర్ఫ్యూమ్‌లు వల్ల కొన్ని గుర్రాలు ఉద్రేకమవుతాయి''అని క్వీన్ కోసం గుర్రాలు సిద్ధంచేసే క్లోర్ బాల్డింగ్ చెప్పారు.

క్వీన్ ఎలిజబెత్ 2

కార్లు

అధికారిక కార్యక్రమాల కోసం రాణి గుర్రపు బండ్లు లేదా బెంట్లీ కార్లను ఉపయోగించేవారు.

ఒక్కోసారి ల్యాండ్ రోవర్ కార్లను కూడా ఆమె ఎంచుకునేవారు.

ప్రిన్స్ ఫిలిప్‌తో కలిసి డ్రైవింగ్‌కు వెళ్లడానికి ఆమె ఇష్టపడేవారు. వీరిద్దరికీ జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్లంటే చాలా ఇష్టం. ల్యాండ్ రోవర్ కార్ల తయారీ సంస్థ ఇప్పుడు భారత్‌కు చెందిన టాటా ఆధీనంలో ఉంది.

రాణిగా మారేముందు రెండో ప్రపంచ యుద్ధంలో లారీ డ్రైవర్‌గా, మెకానిక్‌గా ఎలిజబెత్-2 సేవలు అందించారు.

ఒక్కోసారి అతిథులను తన కారులో ఎక్కించుకుని ఆమె షికారుకు తీసుకెళ్లేవారు.

1998 సెప్టెంబరులో సౌదీ అరేబియా యువరాజు అబ్దుల్లాను బల్మోరల్ ప్యాలెస్‌కు రాణి ఆహ్వానించారు. భోజనం తర్వాత తమ 20,000 హెక్టార్ల ఎస్టేట్‌ను కారులో ఆయనకు ఎలిజబెత్ చూపించారు.

అయితే, మొదట్లో వద్దని చెప్పిన అబ్దుల్లా ఎట్టకేలకు కారు ముందుసీట్లో కూర్చొన్నారని బ్రిటిష్ దౌత్యవేత్త షెరార్డ్ కౌపెర్ తన పుస్తకంలో రాశారు. క్వీన్ డ్రైవింగ్ సీటులో కూర్చోవడంతోపాటు చక్కగా కారు నడపడాన్ని చూసి అబ్దుల్లా ఆశ్చర్యపోయారని ఆయన వివరించారు.

మధ్యలో వేగాన్ని చూసి ఆందోళన పడిన అబ్దుల్లా, కాస్త నెమ్మదిగా కారును నడపాలని రాణిని కోరినట్లు ఆ పుస్తకంలో వివరించారు.

సౌదీ అరేబియాలో మహిళలు కారు నడపొచ్చని నిర్ణయం తీసుకోవడానికి చాలా ఏళ్ల ముందే ఈ ఘటన జరిగింది.

మొత్తంగా రాణి దగ్గర ఉండే కార్ల విలువ 10 మిలియన్ డాలర్లు (రూ.79.73 కోట్లు) ఉంటుందని అంచనా. మొత్తంగా ఆమె జీవితంలో 30కిపైగా ల్యాండ్ రోవర్లు ఆమె దగ్గర ఉండేవి.

బల్మోరల్ క్యాజిల్

భూములు

సండే టైమ్స్ అంచనా ప్రకారం.. క్వీన్ వ్యక్తిగత ఆస్తుల విలువ 426 మిలియన్ డాలర్లు (రూ.3,396.51 కోట్లు). ఆమె ఆస్తుల్లో భూములు, ఆభరణాలు, కళాఖండాలు ఎక్కువగా ఉన్నాయి.

రాజ కుటుంబ నివాసాలతోపాటు భారీగా భూములు కూడా రాణి పేరిట ఉన్నాయి. అయితే, ఈ భూములను అమ్మడానికి వీల్లేదు.

లండన్‌లోని రీజెంట్ స్ట్రీట్, బెర్క్‌షైర్‌లోని ఆస్కర్ హార్స్ రేస్‌కోర్స్ కూడా రాణి పేరిట ఉన్నాయి.

మరోవైపు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల వరకు సముద్ర ప్రాంతం కూడా రాణి పేరిటే ఉంది. అంటే ఈ ప్రాంతంలో ఖనిజాన్వేషణ చేసే సంస్థలు రాణికి రాయల్టీ చెల్లించేవి.

క్వీన్ విక్టోరియా పెళ్లి వస్త్రాలు

తరతరాలుగా..

తరతరాల నుంచి కొన్ని ఆస్తులు కూడా వారసత్వంగా క్వీన్ ఎలిజబెత్ 2కు వచ్చాయి.

వీటిలో విక్టోరియా పెళ్లి బట్టలు కూడా ఉన్నాయి. తెల్లని పెళ్లి వస్త్రాలు ప్రాచుర్యం పొందడానికి విక్టోరియానే కారణమని చెబుతుంటారు.

మరోవైపు హెన్రీ 8 వేసుకున్న శరీర రక్షణ కవచం కూడా రాయల్ కలెక్షన్‌లలో ఉంది.

పోప్‌తో విభేదాలు రావడంతో ఇంగ్లండ్ చర్చిని స్వతంత్రంగా ఆయన ప్రకటించారు. దీనికి ఆయన్ను అధిపతిగా

ఆయనే ప్రకటించుకున్నారు. ఈ పదవి కూడా తరతరాలుగా రాజకుటుంబ అధిపతికి వస్తూ ఉంది.

ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాలు రాజ కుటుంబం దగ్గర ఉన్నాయి

ఆభరణాలు

రాజ కుటుంబం నుంచి తలచుకోగానే మనకు వజ్రాలు, బంగారం గుర్తుకు వస్తుంటాయి.

బ్రిటన్ వలస సామ్రాజ్యం మానవ చరిత్రలోనే అతిపెద్దది. దీంతో ప్రపంచంలోని అత్యంత విలువైన వజ్రాలు రాజ కుటుంబం దగ్గరకు వచ్చాయి.

ఆఫ్రికా నుంచి వెలికితీసిన ప్రపంచంలోనే అతిపెద్ద, 530.2 క్యారట్ల క్లియర్ కట్ డైమండ్ రాయల్ సెప్టర్‌లో ఉంది.

కోహినూర్

1849లో పంజాబ్‌ ఆక్రమణ అనంతరం సంపాదించిన కోహినూర్ వజ్రం కూడా రాజకుటుంబం దగ్గరే ఉంది.

మొదట్లో క్వీన్ విక్టోరియా వస్త్రాలపై దీన్ని ధరించేవారు. ఆ తర్వాత దీన్ని క్వీన్ అలెగ్జాండ్రా కిరీటంలో అమర్చారు. ఆ తర్వాత ఈ కిరీటాన్ని క్వీన్ మదర్ తన పట్టాభిషేకంలో ధరించారు.

రాజ కుటుంబ ఆభరణాలతోపాటు క్వీన్ ఎలిజబెత్ 2 కూడా కొన్ని విలువైన వజ్రాలు, ఆభరణాలను సేకరించారు.

అయితే, ఆమె ఎక్కువగా ముత్యాల ఆభరణాలు మాత్రమే పెట్టుకొని కనిపించేవారు.

2006 జూన్ 15న లండన్‌లోని సెయింట్ పౌల్ క్యాథెడ్రల్‌కు వచ్చిన క్వీన్ ఎలిజబెత్ 2

ఆమెతోపాటు సమాధి

క్వీన్ దగ్గరుండే ఆభరణాలన్నీ దాదాపుగా కింగ్ చార్లెస్‌కు రాబోతున్నట్లు రాయల్ అధికారులు చెబుతున్నారు.

అయితే, ఆమె సేకరించిన వాటిలో రెండింటిని ఆమె శవపేటికలో ఉంచుతారని రాజ కుటుంబ వ్యవహారాల నిపుణులు వివరిస్తున్నారు.

ముత్యాల చెవి పోగులు, పెళ్లి ఉంగరం ఆమె శవపేటికలో ఉంచే అవకాశముందని బ్రిటన్‌లోని నేచురల్ డైమండ్ కౌన్సిల్‌లోని కమ్యూనికేషన్స్ విభాగం అధిపతి లీసా లెవిన్సన్ అంచనా వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Queen Elizabeth 2: Kohinoor diamond, swans, dolphins.. What is coming from King Charles's mother?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X