రిపబ్లిక్ డే పరేడ్‌లో రఫేల్ యుద్ధ విమాన విన్సాసాలు: వెర్టికల్ చార్లీ ఫార్మేషన్!
న్యూఢిల్లీ: జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకల్లో భారత వాయుసేనలో కొత్తగా చేరిన రఫేల్ యుద్ధ విమానాలు తొలిసారిగా ప్రదర్శనకు రానున్నాయి. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల పరేడ్‌లో ఒక రఫేల్ విమానం పాల్గొని.. 'వర్టికల్ చార్లీ' విన్యాసాన్ని ప్రదర్శించనున్నట్లు భారత వైమానిక దళం(ఐఏఎఫ్) సోమవారం వెల్లడించింది.
వర్టికల్ చార్లీ ఫార్మేషన్‌లో యుద్ధ విమానం తక్కువ ఎత్తు నుంచి నిలువుగా ప్రయాణించి పైకి వెళ్తుంది. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వాయుసేనకు చెందిన 38 యుద్ధ విమానాలు, సైన్యానికి చెందిన నాలుగు విమానాలు గగనతలంలో విన్యాసాలు చేయనున్నట్లు వింగ్ కమాండర్ ఇంద్రనీల్ నంది వెల్లడించారు.

2016లో ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి విడతలో భాగంగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు ఇటేవల భారత్ చేరుకున్నాయి. సెప్టెంబర్ 10న అంబాలా ఎయిర్‌బేస్‌లో ఈ విమానాలను లాంఛనంగా వైమానిక దళంలో చేర్చారు.
ప్రస్తుతం ఈ యుద్ధ విమానాలు 17వ స్క్వాడ్రన్‌లో భాగంగా లఢఖ్‌లో ఉన్నాయి. సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రఫేల్ విమానాలను అక్కడికి తరలించారు. చైనా బలగాలు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉంచారు.
ఇది ఇలావుంటే, కరోనా కారణంగా గణతంత్ర వేడుకల్లో కేంద్రం పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం. వీక్షకుల సంఖ్యను తగ్గించడంతోపాటు భౌతిక దూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. పరేడ్ దూరాన్ని కూడా తగ్గించినట్లు సమాచారం. యూకే ప్రధాని బోరీస్ జాన్సన్ ను గణతంత్ర వేడుకలకు ఆహ్వానించినప్పటికీ కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి కారణంగా ఆయన భారత పర్యటనను విరమించుకున్నారు.