టీవీల్లోనేనా? పార్లమెంటులో మాట్లాడరా?: మోడీపై రాహుల్ ఫైర్
‘పీఎం టీవీలలోనే మాట్లాడతారు, పాప్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో మాట్లాడతారు. కానీ పార్లమెంటులో మాట్లాడరా?’ అంటూ రాహుల్ గాంధీ నిలదీశారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 'పీఎం టీవీలలోనే మాట్లాడతారు, పాప్ మ్యూజిక్ కాన్సర్ట్‌లో మాట్లాడతారు. కానీ పార్లమెంటులో మాట్లాడరా?' అంటూ నిలదీశారు. ప్రధాని మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ ఇప్పటికే డిల్లీ, ముంబై ప్రాంతాల్లోని ఏటీఎం వద్ద బారులు తీరిన ప్రజల వద్దకు వెళ్లి నగదు కోసం వారు పడుతున్న కష్టాల గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆర్థికవ్యవస్థకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని మోడీ కేవలం ముగ్గురు, నలుగురు వ్యక్తులను సంప్రదించి తీసుకోవడం సబబు కాదన్నారు.

నగదు కొరత తీవ్రంగా ఉందని, దీని వల్ల ఏటీఎంలు, బ్యాంకుల ఎదుట ప్రజలు భారీగా క్యూలు కడుతున్నారని రాహుల్ అన్నారు. కాగా, నవంబర్ 8న ప్రధాని మోడీ ప్రకటించిన నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న విషయం తెలిసిందే.
విపక్షాల ఆందోళన: ఉభయసభలు రేపటికి వాయిదా
పెద్దనోట్ల రద్దుపై విపక్షాల ఆందోళనల నేపథ్యంలో పార్లమెంటు సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోడీ సమక్షంలోచర్చ చేపట్టాలని కోరుతూ విపక్షాలు సభా కార్యకలాపాలను అడ్డుకున్నాయి. డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు.
రాజ్యసభలో ఉదయం నుంచి ఇదే తంతు కొనసాగింది. పలు వాయిదాల తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభ సజావుగా సాగే అవకాశం లేకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్ సభను బుధవారానికి వాయిదా వేశారు. ఇటు లోకసభ కూడా విపక్షాల ఆందోళనతో బుధవారానికే వాయిదా పడింది.












Click it and Unblock the Notifications