నరేంద్రమోడీ, అమిత్ షా భావనలకు విరుద్ధంగా రాహుల్ గాంధీ?
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను ఉపయోగించి కాంగ్రెస్‌ను భయపెట్టాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. తనతోపాటు ఇతర విపక్ష పార్టీల గొంతును నొక్కాలని వ్యూహరచన చేస్తున్నారంటూ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కు సంబంధించి యంగ్ ఇండియన్ కార్యాలయాన్ని సీజ్ చేయడంపై పార్టీ ఎంపీలతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన రాహుల్ మోడీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నేషనల్ హెరాల్డ్ విషయానికొస్తే అది పూర్తిగా బెదిరింపు చర్య అని, మాపై ఒత్తిడి తెస్తే మేం మౌనంగా ఉంటామని మోడీ, అమిత్ షా భావిస్తున్నారని, కానీ వారికి భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మోడీ, అమిత్ షా ఏం చేసినా తమ నిర్ణయం మీద తాము నిలబడతామని రాహుల్ అన్నారు. దేశంలో ప్రశాంత వాతావరణం కల్పించేందుకు, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తన బాధ్యతను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

మనీలాండరింగ్ కేసులో రాహుల్ గాంధీని ఐదురోజుల్లో 50 గంటలపాటు ఈడీ విచారించింది. అనంతరం సోనియాగాంధీని విచారించింది. ఆమెను దాదాపు 100 ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం.ఈడీ విచారణ పేరుతో పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల సమయానికి పార్టీని పూర్తిగా బలహీనం చేయాలనే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.












Click it and Unblock the Notifications