పొంగులేటి, జూపల్లికి కాంగ్రెస్ కండువా- దక్కే పదవులేంటీ?
హైదరాబాద్/న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జోరు మీద ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి వచ్చేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. అధికార భారత్ రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నిలువరించడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. బీఆర్ఎస్‌కు ధీటుగా పావులు కదుపుతోంది. చేరికలకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది.
ఇందులో భాగంగా- ఖమ్మం, జోగులాంబ గద్వాల జిల్లాలకు చెందిన సీనియర్ నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావును పార్టీలో చేర్చుకోవడానికి అవసరమైన చర్యలన్నింటినీ పూర్తి చేసింది కాంగ్రెస్. ఇక వారి చేరిక లాంఛనప్రాయమే. జులై 2వ తేదీన ఖమ్మంలో నిర్వహించబోయే భారీ బహిరంగ సభ వేదికగా వారిద్దరూ కాంగ్రెస్ కండువాను కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఇవ్వాళ దేశ రాజధానిలో పార్టీ అధిష్ఠానంతో భేటీ అయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ఇతర నాయకులతో ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సమావేశం అయ్యారు. సుమారు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ములుగు శాసన సభ్యురాలు సీతక్క, లోక్‌సభ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనర్సింహ.. తదితరులు ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో- రూపొందించాల్సిన మేనిఫెస్టో, చేపట్టాల్సిన ప్రచార కార్యక్రమాలు ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి.
జులై 2వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి.. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి తెలియజేశారు. ఈ సభకు హాజరు కావాలంటూ ఆహ్వానించారు. ఆ సభలోనే పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారానికి నాందిగా ఈ సభను నిర్వహిస్తామని, లక్షలాది మందిని సమీకరిస్తామని చెప్పారు.
దీనిపై రాహుల్ గాంధీ అప్పటికప్పుడు ఏ నిర్ణయాన్నీ తీసుకోలేదని తెలుస్తోంది. సమయం తక్కువగా ఉన్నందున ఖమ్మంలో నిర్వహించ తలపెట్టిన సభకు హాజరవుతానా? లేదా? అనేది స్పష్టం చేయలేదని సమాచారం. రాహుల్ గాంధీ షెడ్యూల్‌కు వీలుగా ఖమ్మం సభ తేదీల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకోవచ్చనే అభిప్రాయాలు పార్టీ నాయకుల్లో వ్యక్తమౌతోన్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు పొంగులేటి. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌లో జాయిన్ అయ్యారు గానీ అక్కడ ఎక్కువ కాలం పాటు కొనసాగలేకపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు జూపల్లి. అనంతరం బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ.. ఆ పార్టీకి దూరం అయ్యారు. వారికి ఉన్నఅనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక పదవులు దక్కుతాయని చెబుతున్నారు పార్టీ నాయకులు.












Click it and Unblock the Notifications