Rahul Gandhi : మహిళా బిల్లు తక్షణ అమలు-కేంద్రానికి రాహుల్ డిమాండ్..
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల పేరుతో కేంద్రం నిర్వహించిన నాలుగు రోజుల భేటీలో దశాబ్దాలుగా పెండిగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. తొలుత లోక్ సభలో, అనంతరం నిన్న రాజ్యసభలోనూ అమోదం పొందిన ఈ బిల్లు ద్వారా లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ మహిళలకు 33 సీట్లు రిజర్వ్ చేసేందుకు వీలు కలగబోతోంది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ తక్షణ అమలుకు డిమాండ్ చేశాయి. బిల్లు ఆమోదం తర్వాత రాహుల్ గాంధీ దీన్ని తక్షణం అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు.
పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం తర్వాత మహిళా బిల్లును రాష్ట్రపతి కూడా ఆమోదిస్తే వెంటనే అమల్లోకి వస్తుంది. అయితే కేంద్రం మాత్రం ఇప్పటికిప్పుడు ఈ బిల్లు అమల్లోకి వస్తే ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఈ బిల్లు ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని భావిస్తోంది. దీంతో ఈ బిల్లు ఇప్పుడు ఆమోదం పొందినా 2029 తర్వాతే దీని ఫలాలు మహిళలకు అందుతాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో రాహుల్ దీనిపై స్పందించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ డిమాండ్ చేశారు. కుల గణన డిమాండ్ నుంచి దృష్టి మరల్చడం కోసమే ప్రభుత్వం దీని అమలును వాయిదా వేస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు మంచి విషయమే, అయితే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ రూపంలో రెండు "ఫుట్ నోట్స్" దీనికి జత చేశారని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన ఒక రోజు తర్వాత రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళా రిజర్వేషన్ కోటాను వాయిదా వేయడానికి డీలిమిటేషన్, జనాభా లెక్కలు కుంటి సాకులు మాత్రమేనని కాంగ్రెస్ నేత రాహుల్ పేర్కొన్నారు. వాస్తవానికి ఈ బిల్లును అమలు చేయకుండా ఎన్నికల సమస్యను సృష్టించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. కాంగ్రెస్ ఈ బిల్లును టీజింగ్ భ్రమగా పేర్కొంది.












Click it and Unblock the Notifications