ప్రధానిని అవమానించారు: రాహుల్‌పై శివసేన ఫైర్
ముంబై: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై శివసేన తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ప్రధాని మన్మోహన్ సింగ్‌కు బుధవారం ఇచ్చిన వీడ్కోలు విందు కార్యక్రమానికి హాజరుకాకుండా రాహుల్ గాంధీ ప్రధానిని అవమానించారని శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రావత్ ఆరోపించారు.
ఈ వీడ్కోలు ఒక్క ప్రధానికే కాదని అన్న ఆయన, రాహుల్ గాంధీకి కూడా అని చెప్పారు. ఇక రాహుల్ గాంధీ ఎక్కువ విదేశాల్లోనే ఉంటారని, సెలవులకు మాత్రమే భారతదేశానికి వస్తారని సంజయ్ రావత్ ఎద్దేవా చేశారు.

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం మే 16 తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓటమి పాలవుతుందని చెప్పారు. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్తారని అన్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో తమ పార్టీ పాత్ర గురించిన వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉండగా ప్రధానికి ఇచ్చిన విందుకు హాజరుకాకపోవడంతో రాహుల్ గాంధీపై వివిధ పార్టీల నుంచి ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో విస్తృత ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆయన ఎన్నికల ఫలితాలు వెలువడనున్న శుక్రవారం లోపు (మే 16) భారతదేశానికి తిరిగివస్తారని తెలిసింది.












Click it and Unblock the Notifications