Rahul Gandhi : అనర్హతవేటుపై స్పందించిన రాహుల్.. అదానీకే అన్నీ ఇస్తారా ? ప్రజల్లోనే తేల్చుకుంటా..
తనపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని రాహుల్ తెలిపారు. నిబంధనలు మార్చి అదానీకి ఎయిర్పోర్టులు ఇచ్చారని, అదానీ షెల్ కంపెనీల్లో రూ.20వేల కోట్లు పెట్టు బడులు ఎవరు పెట్టారని రాహుల్ ప్రశ్నించారు. ఇందులో చైనా దేశస్తుల హస్తం ఉందన్నారు. ఎవరతను అని రాహుల్ ప్రశ్నించారు. తాను రెండు ప్రశ్నలు అడిగానని, వాటికి జవాబు లేదని కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.

కేంద్ర మంత్రులు పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని రాహుల్ ఆరోపించారు. తాను దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడానని, పోరాడతానని రాహుల్ స్పష్టం చేశారు. అదానిపై తాను మాట్లాడటం ప్రారంభించగానే కేంద్రం కుట్రలు ప్రారంభించిందన్నారు.అదానీ వ్యవహారంపై ప్రజలదృష్టి మళ్లించేందుకే తనపై అనర్హత వేటు వేశారన్నారు. ఇలాంటి పిచ్చి పనులకు తాను బెదిరేది లేదన్నారు. కోర్టు తీర్పుపై మాట్లాడేందుకు రాహుల్ నిరాకరించారు.
ఓసారి ఓబీసీ అంటారని, ఓసారి విదేశీ అంటారని రాహుల్ తెలిపారు. అదానీ వ్యవహారంపై తాను అన్నిసాక్ష్యాలు పార్లమెంటు ముందుంచినట్లు రాహుల్ తెలిపారు. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. కనీసం తన వివరణ తీసుకోవాలని స్పీకర్ ను కోరినట్లు రాహుల్ వెల్లడించారు. తాను మళ్లీ ప్రజల్లోకి వెళ్తానని,తాను నిజమే మాట్లాడతానని రాహుల్ స్పష్టం చేశారు.
వయనాడ్ ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని రాహుల్ తెలిపారు. ఇకపై ప్రజల్లోకి వెళ్తానని, వారితోనే ఉంటానని, ప్రతిపక్ష నేతలందరితో కలిసి పనిచేస్తానని వెల్లడించారు. ఈ దేశం తనకు కావాల్సినవన్నీ ఇచ్చిందన్నారు. ప్రేమ, గౌరవం ఈ దేశం తనకు ఇచ్చిందన్నారు.












Click it and Unblock the Notifications