"ఫకీర్"ను ప్రశ్నలు అడగొద్దు.. మోదీపై రాహుల్ ఫైర్ .. పెట్రోల్, గ్యాస్ ధరల పెంపుపై..
కేంద్రంపై ఉద్యమ పోరుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా హస్తం నేతలు, శ్రేణులు నిరసనలు, ఆందోళనలకు దిగారు.. ఇందులో భాగంగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో నిరసన చేపట్టారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్రం దిగివచ్చే వరకు తమపోరాటం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆందోళనను ఉద్ధృతం చేస్తారని హెచ్చరించారు..

పెట్రోల్ ధరల పెంపుపై రాహుల్ గాంధీ..
గత 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం 9 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న చమురు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఫకిర్ ని ప్రశ్నలు అడగవద్దు.. కెమెరాల్లో జ్ఞానాన్ని పంచుకోండి అంటూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ సెటైర్లు విసిరారు. దేశాన్ని బీజేపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. పార్లమెంటు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్ నేతలు, మల్లికార్జున్ ఖర్గే, అధిర్ రంజన్ చౌదరి, అభిషేక్ సింఘ్వీలు, ఎంపీలు పాల్గొన్నారు. ప్లకార్డులతో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎన్నికలు ముగియగానే పెట్రోలియం ధరల పెంపు
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియగానే మరలా పెట్రోల్ రేట్లను కేంద్రం ప్రభుత్వం రోజువారిగా పెంచుకుంటూపోతుందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. పొరుగు దేశాల్లో లేని పెట్రోల్ ధరలు మన దేశంలోనే ఉన్నాయని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. వివిధ దేశాల్లో పెట్రోల్ ధరలను వివరిస్తూ ట్విట్ చేశారు. మన దేశ కరెన్సీలో ఆఫ్ఘనిస్థాన్ 66.99, పాకిస్థాన్ 62.18, శ్రీలంక 72.96 , బంగ్లాదేశ్ 78.53, భూటాన్ 86.28 రేట్లు ఉన్నాయని తెలిపారు. ఇండియాలో మాత్రం రూ. 101.81 ఉందని దుయ్యబట్టారు.

ప్రజల నడ్డివిరుస్తున్న మోదీ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల నడ్డివిరుస్తోందని మోదీ సర్కార్‌పై ప్రియాంక గాంధీ మండిపడ్డారు. నిత్యావసర ధరలు పెరిగి వారిపై భారం పడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచని పద్ధతిని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. దేశ పరిస్థితిని రోజు రోజుకు మోదీ దిగజార్చుతున్నారని విమర్శించారు. మోదీ సర్కార్ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాల్సిన అవరసం ఉందని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications