కర్ణాటక కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా రాహుల్, శెట్టర్, రేవంత్, అజారుద్దీన్: సచిన్ పైలట్ ఔట్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ తోపాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్‌కు కూడా చోటు కల్పించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్‌కు ఈ జాబితాలో చోటు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇక తెలంగాణ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మరో కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ మహ్మద్ అజరుద్దీన్ లు కూడా ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో కూడిన జాబితాను బుధవారం కాంగ్రెస్ ప్రకటించింది. ఈ జాబితాలో వివిధ రాష్ట్రాలకు చెందిన అగ్రనేతలకు కూడా చోటు కల్పించారు.

కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరాం రమేశ్, వీరప్ప మొయిలీ, రణ్‌దీప్ సూర్జూవాలా, కేసీ వేణుగోపాల్, చిదంబరం వంటి ముఖ్య నేతలతోపాటు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ ఉన్నారు. కన్నయ్య కుమార్ వంటి యువ నేతలకు కూడా అవకాశం కల్పించారు.
అయితే, 2018 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరించిన సచిన్ పైలట్‌కు మాత్రం ఈ జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. అయితే, ఆయన రాజస్థాన్‌లో గెహ్లాట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కాగా, కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి.
ఇప్పటికే బీజేపీ కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. బీజేపీ కూడా తెలుగు నేతలకు అవకాశం కల్పించింది. స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను బీజేపీ అధిష్టానం నియమించింది. ఆమెతోపాటు తెలంగాణ బీజేపీ నాయకులు లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, జితేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, రఘునందన్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్ కుమార్ ప్రచారంలో పాల్గొంటారు.
కాంగ్రెస్ ఐదవ జాబితా: సీఎం బొమ్మైకి ప్రత్యర్థికి యాసిర్
2023లో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తన ఐదవ జాబితాను బుధవారం విడుదల చేసింది. పార్టీ అధిక ప్రాధాన్యత కలిగిన షిగ్గావ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ప్రత్యర్థిగా సీనియర్ నేత యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్‌ను బరిలోకి దింపింది.












Click it and Unblock the Notifications