చరిత్ర తెలియదు: మోడీపై రాహుల్ గాంధీ విసుర్లు
బార్డోలీ: బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సర్దార్ పటేల్ వారసత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. గుజరాత్ నాయకులకు చరిత్ర తెలియదని ఆయన అన్నారు. సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ చివరి వరకు కాంగ్రెసు పార్టీలోనే ఉన్నారని ఆయన అన్నారు.
ఆర్ఎస్ఎస్ విషపూరితమైందని సర్దార్ పటేల్ అన్నట్లు ఆయన గుర్తు చేశారు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే మహాత్మా గాంధీని హత్య చేయించిందని ఆయన ఆరోపించారు. ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలని సర్దార్ పటేల్ అనుకున్నారని ఆయన అన్నారు.

గుజరాత్ నాయకులు చరిత్ర పుస్తకాలను గానీ సర్దార్ పటేల్ సిద్ధాంతాన్ని గానీ చదవరని ఆయన అన్నారు. గుజరాత్‌లోని బార్డోలీలో శనివారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. అవినీతిపై పోరాటంలో బిజెపికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు.
అవినీతిని అంతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ఆమోదింపజేసిందని ఆయన అన్నారు తొమ్మిదేళ్లుగా గుజరాత్‌లో లోకాయుక్తను ఏర్పాటు చేయకుండా నరేంద్ర మోడీ జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు
అవినీతి అంతానికి బిజెపి కట్టుబడి ఉంటే పార్లమెంటులో ఆరు అవినీతి వ్యతిరేక బిల్లులకు బిజెపి ఎందుకు సహకరించడం లేదని ఆయన అడిగారు. తాము చాయ్‌వాలాలను, రైతులను, కార్మికులను, ఇతరులను గౌరవిస్తామని, కానీ ప్రజలను మోసం చేసేవారిని గౌరవించబోమని రాహుల్ గాంధీ అన్నారు.












Click it and Unblock the Notifications