ఇక వందే భారత్ మెట్రో రైళ్లు కూడా
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సేవలు మరింత విస్తృతం కానున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్న అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల సంఖ్య ఇక మరింత పెరగనుంది. ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో ఆ సర్వీసులను ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తోన్న ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 రైళ్లు పట్టాలెక్కాయి. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా- ఒడిశాలోని పూరీ మధ్య ఇటీవలే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెట్టింది కేంద్రం. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను మరింత విస్తృతం చేయనుంది. కొత్తగా మెట్రో రైళ్లుగా దీన్ని అందుబాటులోకి తీసుకుని రానుంది. వందే మెట్రో పేరుతో దశలవారీగా అన్ని నగరాల్లోనూ ప్రయాణికులకు చేరువ చేయనుంది. దీనికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది కూడా. వచ్చే మూడు సంవత్సరాల వ్యవధిలో వందే మెట్రో రైళ్లను అన్ని నగరాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
తొలి దశలో ముంబైలో ఈ వందే మెట్రో రైలు సర్వీసులు పట్టాలెక్కనున్నాయి. లక్షలాదిమంది ముంబైకర్లు రోజూ రాకపోకలు సాగించే లోకల్/సబర్బన్ రైళ్ల స్థానంలో వందే మెట్రో సర్వీసులను అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం 238 సర్వీసులకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. ముంబై అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ 3, 3ఏ కింద కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అయ్యే ఖర్చును భరించాల్సి ఉంటుంది.
వచ్చే 35 సంవత్సరాల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వందే మెట్రో సర్వీసులను రూపొందించేలా రైల్వే బోర్డు చర్యలు తీసుకోనుంది. వాటిని సమీకరించుకోవడానికి అవసరమైన టెండర్ల ప్రక్రియను జారీ చేయడానికి ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్‌కు అనుమతులను మంజూరు చేసింది. 12 నుంచి 15 ర్యాకులు ఉండేలా వందే మెట్రో రైళ్లను డిజైన్ చేయాలని సూచించింది.
అనుమతులు మంజూరు కావడంతో ముంబై రైల్ వికాస్ కార్పొరేషన్ అధికారులు తక్షణ చర్యలు దిగారు. పశ్చిమ, మధ్య రైల్వే జోన్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆయా జోన్ల నుంచి దీనికి సంబంధించిన నివేదికలను వారం రోజుల్లోగా అందజేయాలని సూచించారు. అవి అందిన వెంటనే టెండర్ల ప్రక్రియను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. దశలవారీగా ముంబై లోకల్/సబర్బన్ రైళ్లను తొలగించి వాటి స్థానంలో వందే మెట్రోలను పట్టాలెక్కిస్తారు.












Click it and Unblock the Notifications