వినేష్ ఫోగట్ కు రైల్వే గుడ్ న్యూస్-బ్రిజ్ భూషణ్ పై బీజేపీ ఆంక్షలు..!
పారిస్ ఒలింపిక్స్ లో ఫైనల్ వరకూ చేరుకుని రికార్డు సృష్టించిన మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆటకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ కు హర్యానా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టికెట్ కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ఆమె ప్రస్తుతం పనిచేస్తున్న రైల్వే ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని అధికారులకు పంపారు. అయితే రైల్వే ఉద్యోగానికి ఆమె చేసిన రాజీనామా ఆమోదించాలంటే మూడు నెలల గడువు తప్పనిసరి.
రైల్వే నిబంధనల మేరకు ఉద్యోగి రాజీనామా సమర్పిస్తే ఆమోదానికి మూడు నెలల నోటీసు కాలం ఉంటుంది. అయితే ప్రత్యేక కారణంతో రాజీనామా చేస్తున్నందున వెంటనే ఆమోదించాలని వినేష్ ఫోగట్ కోరారు. దీంతో వినేష్ రాజీనామాకు త్వరలో అధికారులు ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వినేష్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన మరో రెజ్లర్ భజరంగ్ పూనియా రాజీనామాను కూడా రైల్వే ఆమోదించబోతోంది.

వాస్తవానికి హర్యానా ఎన్నికల్లో అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు సెప్టెంబర్ 12తో ముగియనుంది. ఆలోపు వినేష్ రాజీనామాకు ఆమోదముద్ర పడకుంటే ఆమె పోటీ చేయడం కష్టమే. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో వినేష్ కు రైల్వే శాఖ క్లియరెన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్, భజరంగ్ పూనియాపై విమర్శలకు దిగిన రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను బీజేపీ మందలించింది. అంతే కాదు వీరిద్దరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆంక్షలు విధించింది.












Click it and Unblock the Notifications