సీనియర్ సిటిజన్లకు టికెట్ల రాయితీపై రైల్వే శాఖ క్లారిటీ..!
దేశవ్యాప్తంగా ప్రయాణించే రైళ్లలో సీనియర్ సిటిజన్లకు టికెట్లపై గతంలో రైల్వే శాఖ రాయితీ ఇచ్చేది. కానీ కరోనా నేపథ్యంలో అన్ని రాయితీలను ఎత్తేసిన రైల్వేశాఖ దీన్ని కూడా తొలగించింది. అయితే తాజాగా మరోసారి దీన్ని పునరుద్ధరిస్తున్నట్లు భారీ ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్ సిటిజన్లు రైల్వేశాఖ ఉత్తర్వుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రైల్వేశాఖ సీనియర్ సిటిజన్లకు మళ్లీ రాయితీ ఇవ్వబోతున్నట్లు పోస్టులు కనిపిస్తున్నాయి.
దీనిపై రైల్వేశాఖ ఇవాళ క్లారిటీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్లకు రాయితీని రైల్వేశాఖ పునరుద్ధరించబోతోందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై 50% రాయితీని పునరుద్ధరిస్తున్నట్లు ఓ మెసేజ్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, దీనికి సంబంధించి, ఎలాంటి రాయితీలకు సంబంధించి అటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదని రైల్వేశాఖ తెలిపింది.

మార్చి 2020లో తాము సీనియర్ సిటిజన్లకు రాయితీ ఉపసంహరించుకున్నప్పటి నుండి ఇప్పటివరకూ రైల్వేశాఖ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రయాణీకులు ఖచ్చితమైన సమాచారం కోసం భారతీయ రైల్వేలు, అధీకృత మీడియా ఛానెల్‌ల నుండి అధికారిక కమ్యూనికేషన్‌లపై మాత్రమే ఆధారపడాలని సూచిస్తోంది. సోషల్ మీడియాలో పోస్టులు చూసి రాయితీ పునరుద్ధరిస్తున్నట్లు నమ్మొద్దంటూ క్లారిటీ ఇచ్చేసింది.
గతంలో కరోనా సందర్భంగా 2020లో రైల్వేశాఖ తమ రైళ్లలో అన్ని రాయితీలను తొలగించింది. అప్పట్లో కరోనా కారణంగా పలు రైళ్ల రాకపోకల్లో మార్పులు, బోగీల్లో మార్పులు, ఎక్స్ ప్రెస్, పాసింజర్ సర్వీసుల్లో మార్పులు జరిగాయి. దీంతో వృద్ధులతో పాటు విద్యార్ధులకు, ఇతర వర్గాలకు ఇస్తున్న రాయితీలను అమలు చేయడం సాధ్యం కాలేదు.ఈ నేపథ్యంలో వాటిని తొలగించిన రైల్వేశాఖ తిరిగి ఇప్పటివరకూ పునరుద్దరించలేదు. కానీ గతంలో రాయితీలు పొందిన వారిలో మాత్రం ఆశ మాత్రం అలాగే ఉండిపోయింది.












Click it and Unblock the Notifications