వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజస్థాన్: ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌ నిర్మించారు, స్థానికుల జీవితాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రాజస్థాన్

"భడ్లాలో ఇక సాధారణ జీవితం కష్టమే" అంటున్నారు కేశవ్ ప్రసాద్. సౌర్య ఉర్జా అనే పునరుత్పాదక ఇంధన సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తారాయన.

రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో ఉంది భడ్లా గ్రామం. ఇక్కడ వేసవిలో ఉష్ణోగ్రతలు 50C ని తాకుతాయి. తరచుగా వచ్చే ఇసుక తుఫానులు పరిస్థితిని మరింత దుర్భరం చేస్తాయి.

భడ్లాలో వాతావరణం జీవించడానికి ఎంత దుర్భరమో, సౌర శక్తిని ఉత్పత్తి చేయడానికి అంత అనువైన ప్రాంతం.

సూర్యరశ్మికి కొదువ లేదు. అందుకే, భడ్లా ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్‌కు నెలవైంది. దీనిలో కొంత భాగాన్ని సౌర్య ఉర్జా సంస్థ నిర్మించి, నిర్వహిస్తోంది.

ఈ ప్లాంట్‌లో ఒక కోటి సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇవి సూర్యరశ్మి నుంచి 2,245 మెగావాట్ల ఇంధనాన్ని ఉత్పత్తి చేయగలవు. ఇది సుమారు 45 లక్షల ఇళ్లకు విద్యుత్ అందించడానికి సరిపోతుంది.

అయితే, ఇసుక, ధూళితో నిండిన వాతావరణంలో సోలార్ ప్యానెల్స్‌ను శుభ్రంగా ఉంచడం పెద్ద సవాలని కేశవ్ ప్రసాద్ అన్నారు. అయినప్పటికీ, ఇతర విస్తారమైన సోలార్ ప్లాంట్‌ను నడపడం, మరే ఇతర పవర్ స్టేషన్‌లను నడపడం కంటే సులభమని అన్నారు.

"ఎక్కువ పరికరాలు అవసరం లేదు. ప్లాంట్‌ను నడపడానికి సోలార్ ప్యానెల్స్, కేబుల్స్, ఇన్వర్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఉంటే చాలు" అని కేశవ్ ప్రసాద్ వివరించారు.

పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు

2018లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ ప్లాంటు, ఒక మారుమూల ప్రాంతానికి అనేక పెట్టుబడులు, అవకాశాలను తెచ్చిపెట్టింది.

ఈ సోలార్ పవర ప్లాంట్ తమ జీవితాలను మార్చేసింది అంటున్నారు 18 ఏళ్ల ముఖ్తియార్ అలీ.

"మా ఊర్లో చాలామంది పిల్లలు చదువుకోలేదు. మాకేమీ పెద్ద లక్ష్యాలు ఉండవు. మా ఊరు, మా పొలాలు, పశువులు..ఇదే మా జీవితం. మా తల్లిదండ్రులు పొలం పనులు చేసుకుంటారు లేదా పశువులు కాస్తారు. కానీ, ఈ ప్లాంట్ వచ్చిన దగ్గర నుంచీ ప్రపంచం ఎంత పెద్దదో నాకర్థమైంది. భడ్లా పార్క్ వల్ల చాలామంది ఇంజినీర్లు, అధికారులు, చదువుకున్నవాళ్లు మా ఊర్లకు వస్తున్నారు. అది జీవితం పట్ల నా దృక్పథాన్ని మార్చేసింది. నేను (సోలార్ పార్క్‌లో) అధికారిని కావాలనుకుంటున్నా. గౌరవం, అధికారం ఉండి, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాగల ఆఫీసర్‌ని కావాలనుకుంటున్నా" అన్నారు ముఖ్తియార్ అలీ.

'భూములు లాగేసుకుంటున్నారు'

అయితే, ఈ సోలార్ పార్క్ గురించి అక్కడ ఉన్నవారంతా ఇలాగే అనుకుంటున్నారని చెప్పలేం. ఈ పార్క్ కోసం ఉపయోగించిన 14,000 ఎకరాలలో ఎక్కువ భాగం రాష్ట్ర అధీనంలో ఉంది. అంతకుముందు ఆ ప్రాంతంలోనే స్థానికులు పశువులను మేపేవారు.

"మాలో చాలామందికి పశువుల పెంపకమే జీవనాధారం. ప్రభుత్వ భూములన్నీ వెనక్కు తీసుకున్నారు. పశువులను మేపడానికి మాకు జాగా లేదు. అందువల్ల మా దగ్గర పశువులు తగ్గిపోయాయి" అని భడ్లా గ్రామ పెద్ద సదర్ ఖాన్ చెప్పారు.

ఈ పార్క్ వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి కానీ, చాలీచాలని జీతాలే ఇస్తున్నారని ఆయన అన్నారు.

"మాలో చదువుకోనివారే ఎక్కువ. కాబట్టి కూలీలకు తప్ప ఇతర స్థానికులకు సోలార్ పార్క్‌లో ఉద్యోగాలు లేవు."

ఇంత పెద్ద పవర్ ప్లాంట్ ఉన్నప్పటికీ చాలామంది గ్రామస్థుల ఇళ్లకు కరంట్ కనక్షన్ లేదని సదర్ ఖాన్ అన్నారు.

"మేం ఇక్కడ విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం. కానీ ఇప్పటికీ చుట్టుపక్కల చాలా గ్రామాలకు విద్యుత్తు లేదు. అతిపెద్ద సోలార్ పార్క్ ఉండడం మంచి విషయమే. కానీ, అది మా జీవితాల్లో మార్పు తీసుకురావాలి" అన్నారు సదర్ ఖాన్.

అయితే, ఖాన్ వాదనలను రాజస్థాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ ఢాకా ఖండిస్తున్నారు. ప్రభుత్వ యాజమాన్యంలో ఉన్న ఈ సంస్థ రాజస్థాన్‌లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది.

"భడ్లా పార్కుకు సంబంధించినంత వరకు, భూ పరిహారం గురించి మాకు అధికారికంగా ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. భడ్లా పార్కుకు ఉపయోగించిన భూమి ప్రభుత్వ భూమి" అని చెప్పారు అనిల్ ఢాకా.

పశ్చిమ రాజస్థాన్‌లోని సోలార్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెరగడం వలన భూమి ధరలు, అద్దెలు పెరిగాయని, చిన్న చిన్న భూములున్నవారు చాలామంది లాభపడ్డారని ఢాకా అన్నారు.

చాలామందికి విద్యుత్ కనక్షన్లు లేకపోవడం గురించి మాట్లాడుతూ, అది అంత తేలికైన విషయం కాదని అన్నారు. భడ్లా సోలార్ ప్లాంట్‌లో అధిక వోల్టేజీ విద్యుత్ ఉత్పత్తి చేస్తారని, దాన్ని స్థానిక గ్రామాలకు నేరుగా సరఫరా చేయడం సాధ్యం కాదని చెప్పారు.

భడ్లా వంటి ప్లాంట్లు పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ఖర్చును గణనీయంగా తగ్గిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

భారతదేశంలో 75 శాతం విద్యుత్‌ను బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, 2030 నాటికి మొత్తం విద్యుత్తులో 40 శాతాన్ని సౌర ఇంధనం లాంటి పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది. దీనికి భారీగా భూములు అవసరం అవుతాయి.

ఈ శతాబ్దం మధ్య నాటికి భారతదేశం కర్బన ఉద్గారాలను నికర సున్నా(నెట్ జీరో) కు తగ్గించాలనుకుంటే, దేశంలోని మొత్తం భూభాగంలో 1.7 శాతం నుంచి 2.5 శాతం భూమిని వినియోగించాల్సి ఉంటుందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్ఏ) గత సంవత్సరం చేసిన ఒక అధ్యయనంలో వెల్లడించింది.

'భూముల వివాదం మరింత పెరుగుతుంది'

ప్రస్తుతం 34 పెద్ద సోలార్ ప్రాజెక్టుల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. వాటి భూముల గురించి మరిన్ని వివాదాలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

"పునరుత్పాదాక వనరులకు మారాలంటే విస్తారమైన వనరులు అవసరం అవుతాయి. వాటిల్లో భూమి కీలకమైనది" అని ఎన్విరాన్‌మెంటల్ సపోర్ట్ గ్రూప్‌లో సీనియర్ ఫెలో భార్గవి ఎస్ రావు అన్నారు.

"వర్షాధార భూములు, నీటిపారుదల కల్పించిన భూములను పొడి భూములు, కరువు పీడిత బంజరు భూములు, ఉత్పాదకత లేని భూములుగా గుర్తిస్తారు. అటువంటి భూములను పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు, ముఖ్యంగా సౌర, వాయు ఇంధన ప్రాజెక్టులకు అనువుగా చేసుకోవచ్చు. ప్రస్తుతం మెగా ఇంధన ప్రాజెక్టులకు అనుసరిస్తున్న విధానం భూముల విషయంలో కొంత గందరగోళం సృష్టిస్తోంది. కొంతమంది శక్తిమంతమైన రియల్ స్టేట్ డెవలపర్లు, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే శక్తులు రైతుల చుట్టూ చేరి వారి భూములను లీజుకు ఇచ్చేలా లేదా అమ్ముకునేలా ప్రోత్సహిస్తున్నారు’’ అని భార్గవి రావు అన్నారు.

ప్రస్తుతానికి ఈ సమస్య అంత పెద్దది కాదని, ఇప్పుడిప్పుడే పునరుత్పాదక ఇంధన వనరులకు మారుతున్న దశలో ఉన్నందున అడపాదడపా భూముల సమస్య వస్తోందిగానీ, ఇంకా తీవ్రతరం కాలేదని ఆమె అన్నారు. అయితే, సమీప భవిష్యత్తులో అనేక ప్లాంటులు కార్యరూపం దాల్చనున్నాయి. అప్పుడు ఈ సమస్య మరింత జటిలమవుతుందని అన్నారు.

"2030 నాటికి రైతులపై భూముల విషయంలో తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది. దేశ రైతాంగంలో ఎక్కువమంది వీళ్లే ఉన్నారు" అని భార్గవి అన్నారు.

భార్గవి రావు వాదనలపై స్పందించమని ప్రభుత్వాన్ని కోరింది బీబీసీ. కానీ, ప్రభుత్వం స్పందించలేదు.

భడ్లాలో సోలార్ ప్లాంట్ నిర్వహిస్తున్న కేశవ్ ప్రసాద్ మాత్రం, ఈ భారీ ప్లాంట్ వల్ల స్థానికులకు మేలే జరుగుతోందని అంటున్నారు.

"ఈ సోలార్ పార్క్ చుట్టూ 60 గ్రామాలు ఉన్నాయి. వీరంతా చాలా లాభాలు పొందారు. ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. కొత్త స్కూళ్లు కట్టారు. ఇంతకుముందు వైద్య సదుపాయాలు సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు మొబైల్ మెడికల్ వ్యాన్లు గ్రామాల్లో తిరుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ మాత్రమే కాదు, ప్రజల అభివృద్ధి, పురోగతి కూడా చూడాలి" అంటున్నారు కేశవ్ ప్రసాద్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rajasthan: The world's largest solar power plant has been built here, and what changes have come in the lives of the locals
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X