శబరిమల పరిరక్షణకు కొత్త చట్టం -ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ -కేరళ ప్రచారంలో రాజ్‌నాథ్
కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శబరిమల ఆలయం ప్రధానాంశంగా నిలిచింది. ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప దేవాలయంలో ఏళ్లుగా కొనసాగుతోన్న సంప్రదాయాలు, ఆచారాల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని రక్షణ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. శబరిమల పరిరక్షణకు బాగా ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం ఆదివారం కేరళలో పర్యటించిన రాజ్ నాథ్ సింగ్.. తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. శబరిమల పరిరక్షణ కోసం చట్టం చేస్తామన్న ఆయన.. బీజేపీ మేనిఫెస్టోలోనూ ఈ అంశాన్ని చేర్చినట్లు గుర్తుచేశారు. గత అసెంబ్లీలో బీజేపీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండగా, ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు.

బెంగాల్ లో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు కేరళలో మాత్రం ప్రత్యర్థులుగా తలపడుతుండటాన్ని రాజ్ నాథ్ ఎద్దేవా చేశారు. కేరళలో అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని విమర్శించారు. ఆ ఇద్దరు ఎవరు గెలిచినా ఓడిపోయేది ప్రజలే అని, కాబట్టే జనం జాగరూకతతో ఓటేయాలని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు.

''కేరళలో కాంగ్రెస్, వామపక్ష పార్టీలు ప్రత్యర్థులుగా ఉన్నాయి. కానీ 2వేల కిలోమీటర్ల దూరంలోని వెస్ట్ బెంగాల్ లో మాత్రం ఆ ఇద్దరూ స్నేహితులు. నిజం చెప్పాలంటే కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయి. ఏది గెలిచినా అది ప్రజల ఓటమే అవుతుంది. ఆ రెండు కూటముల సమయం ముగిసింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు'' అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications