చంద్రబాబుని అడగలేదు, సీటు ఎందుకివ్వలేదో: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: తనకు తన సొంత రాష్ట్రమైన ఏపీ నుంచి రాజ్యసభ సీటును ఎందుకు ఇవ్వలేదో తెలియదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం చెప్పారు. తాను రేపు మంగళవారం నాడు బెంగళూరుకు వెళ్లి రాజ్యసభ అభ్యర్థిత్వానికి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు.
తనకు ఏపీ నుంచి సీటు ఇవ్వాలని చంద్రబాబు సర్కారును కోరలేదని తెలిపారు. అధిష్ఠానం నిర్ణయానుసారం నడచుకోవడమే తన విధి అని వివరించారు. పార్టీ కర్ణాటక నుంచి నామినేషన్ వేయాలని తెలిపిందన్నారు. మరో బీజేపీ నేతకు ఏపీ నుంచి సీటు లభిస్తుందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానాన్ని దాటవేశారు.
విజయ సాయి రెడ్డి నామినేషన్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ సాయి రెడ్డి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. ఫాం ఏ, ఫాం బీలను రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి భన్వర్ లాల్‌కు అందించారు. విజయ సాయి రెడ్డితో పాటు వైసిపి నేతలు ఉన్నారు.

రేపు సురేష్ ప్రభు నామినేషన్
కేంద్రమంత్రి, బీజేపీ నేత సురేష్ ప్రభు ఏపీ నుంచి రేపు రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది. రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయానికి ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.
చంద్రబాబు నివాసానికి వైసిపి ఎమ్మెల్యేలు
జూన్ 11న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా ఏపీ నుంచి రాజ్యసభ ఎంపిక చేయాల్సిన అభ్యర్థి విషయంలో కసరత్తు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు ఇటీవల వైసిపి నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు ఆయన నివాసానికి చేరుకున్నారు. టిడిపిలో చేరిన 17మంది ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమయ్యారు. రాజ్యసభ నాలుగో అభ్యర్థి అంశంపై ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చిస్తున్నారు.












Click it and Unblock the Notifications