పెద్దల సభకు వెళ్లేదెవరు- ఆ రెండు స్థానాలపైనే గురి : 16 స్థానాలకు నేడే ఎన్నికలు..!!
రాష్ట్రపతి ఎన్నికల వేళ..పెద్దల సభకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ రోజు జరిగే ఎన్నికలు ఆసక్తి కరంగా మారాయి. మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 స్థానాల భర్తీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. కాగా, అందులో 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాల కోసం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో రెండు స్థానాల్లో హోరా హోరీ పోటీ నెలకొని ఉంది. పెద్దల సభలో వంద మంది బలం సంపాదించిన బీజేపీ ఈ ఎన్నికల తరువాత కొంత మేర తగ్గే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కాంగ్రెస్ సంఖ్య బలం తగ్గి..ప్రాంతీయ పార్టీల సంఖ్యా బలం పెరగనుంది. ఈ ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్ రాష్ట్రాల పరిధిలో 16 స్థానాలకు పోలింగ్ జరగనుంది.. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవం
ఏపీ -తెలంగాణలో జరిగిన ఆరు స్థానాల ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. అధికార పార్టీలు ఆ స్థానాలను దక్కించుకున్నాయి. రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ అక్కడి వారిని కాదని..స్థానికేతురులను బరిలోకి దించిది. దీని పైన ఆ రాష్ట్రంలోని సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మలచుకొనేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అదే విధంగా.. జీ మీడియా గ్రూప్ అధినేత సుభాష్ చంద్రను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి మద్దతు ప్రకటించింది. రాజస్థాన్ లో అసెంబ్లీ సభ్యుల సంఖ్య 200. ప్రస్తుత నాలుగు ఖాళీలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఒక్కో అభ్యర్దికి 41 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పుడున్న బలాలను చూస్తే కాంగ్రెస్ కు రెండు..బీజేపీకి ఒక్క స్థానం దక్కనుంది.

ఆ రెండు రాష్ట్రాల్లో ప్రతిష్ఠాత్మకం
సుభాష్ చంద్ర బరిలో ఉండటంతో పోటీ ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది. అదే విధంగా.. హర్యాణాలో నూ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ రెండు స్థానాలకు పోటీ జరుగుతోంది. ఒక అభ్యర్థి గెలవాలంటే 31 ఓట్లు కావాలి. సరిగ్గా అంతే బలం ఉన్న కాంగ్రెస్ నుంచి అజయ్ మాకెన్ బరిలోకి దిగుతున్నారు. ఆ స్థానాన్ని కాంగ్రెస్‌కు దక్కనీయకుండా చేసేందుకు ఇక్కడా మరో మీడియా అధిపతి కార్తికేయ శర్మ స్వతంత్రంగా బరిలోకి దిగారు. ఇక్కడ బీజేపీ ఆయనకు మద్దతిస్తోంది. దీంతో రాజస్థాన్, హరియాణాలోని రెండు స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఆసక్తి కరంగా మారింది. మహారాష్ట్రలో ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..హోరా హోరీగా
అక్కడ శివసేన 2, కాంగ్రెస్, ఎన్సీపీ చెరో స్థానానికి పోటీకి సిద్ధమయ్యాయి. కాగా, బీజేపీ మూడు స్థానాలకు తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఇక్కడి నుంచి గెలుపు కోసం ఒక్కో అభ్యర్ధికి 42 మంది మద్దతు కావాల్సి ఉంది. అధికార కూటమిగా ఉన్న శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీలు ఒక్కోస్థానంలో గెలిచేందుకు కావాల్సిన బలం సరి పోతుంది. 106 సభ్యులున్న బీజేపీ సైతం రెండుస్థానాలు గెలువగలదు. ఇఖ, ఆరో స్థానం కోసం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ఇదే సమయంలోఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు అవకాశం లభించకపోవడం అధికార కూటమిగా మహావికాస్ అఘాడీకి ఇబ్బందిగా మారుతోంది. దీంతో..ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు జరుగుతున్న రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా మారుతున్నాయి.












Click it and Unblock the Notifications