lok sabha elections 2019 2019 indian general election rahul gandhi ram mandir ram temple ayodhya congress bjp supreme court రాహుల్ గాంధీ రామాలయం రామ మందిరం సుప్రీం కోర్టు అయోధ్య కాంగ్రెస్ బీజేపీ
సుప్రీంలో వాయిదా అనంతరం... అయోధ్య రామమందిరంపై రాహుల్ గాంధీ ఏమన్నారంటే
న్యూఢిల్లీ: 2019 లోకసభ ఎన్నికలకు అయోధ్య రామ మందిరం ప్రధాన అంశం కాదని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం చెప్పారు. రామ మందిరంపై సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసిన కాసేపటికే ఆయన స్పందించారు. ఈ అంశంపై స్పందించాలని మీడియా అడిగింది.
దానికి రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, అందువల్ల దీనిపై తాను ఏమీ మాట్లాడనని చెప్పారు. అలాగే ఈ అంశం 2019కి ప్రాధాన్యతాంశం కాదని, నిరుద్యోగం, అవినీతి అజెండా అన్నారు.

కాగా, అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం కేసు విచారణ మరోసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన పిటిషన్లు ఈ రోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్కే కౌల్‌లతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చాయి. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు వినకుండానే విచారణను ధర్మాసనం జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ కేసు విచారణ కనీసం 30 సెకన్లు కూడా సాగలేదు.
అయోధ్య కేసు విచారణ ప్రారంభం కాగానే ఈ కేసులో విచారణకు తేదీల ఖరారుపై జనవరి 10న తగిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేస్తుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఇరుపక్షాల తరఫున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వె, రాజీవ్ ధవన్‌ల నుంచి ఎలాంటి వాదనలు వినలేదు. వాయిదా వేసింది.
అయోధ్య అంశంపై గతంలో దాఖలైన నాలుగు సివిల్ పిటిషన్లపై అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పు ఇచ్చింది. వివాదానికి సంబంధించి మొత్తం 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచాలని చెప్పింది. కానీ ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పద్నాలుగు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన కోర్టు పిటిషన్లపై జనవరి మొదటి వారంలో తగిన ధర్మాసనం విచారణ చేపడుతుందని గతేడాది అక్టోబరు 29న నిర్ణయించింది. తాజాగా ఇప్పుడు మరోసారి వాయిదా వేసింది.