అల్లోపతిపై మళ్లీ పేలిన రాందేవ్ -వ్యాక్సిన్ అవసరమే లేదట -పతంజలి బాబాపై డాక్టర్ల దేశవ్యాప్త నిరసన
దేశంలో కరోనా విలయం కొనసాగుతూ, మరణాలు భారీ సంఖ్యలో నమోదవుతుండగా, అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం వివాదం మరింత ముదిరింది. కొవిడ్ చికిత్సకు అల్లోపతి పనికిరాదని, అదొక పనికిమాలిన సైన్స్ అని తిట్టిపోసి, కేంద్రం హెచ్చరికతో క్షమాపణలు చెప్పిన యోగా గురు రాందేవ్, తిరిగి అదే పనిగా అల్లోపతిని తిడుతూ, డాక్టర్లపై నిందారోపణలు చేస్తున్నారు. ఇండియాన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) సైతం బాబాకు అంతే ఘాటుగా బదులిస్తూ వస్తున్నది..
కొవిడ్ వ్యాక్సిన్ల సమర్థత, కరోనాకు అల్లోపతి విధానంలో వైద్యంపై యోగా గురువు రాందేవ్ బాబా మళ్లీ విమర్శలు చేశారు. కోవిడ్ వ్యాక్సిన్లు వేసుకున్నా, కొందరు మరణిస్తున్నారని, అల్లోపతి వైద్య విధానం 100 శాతం పనిచేయలేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆదివారం ఓ జాతీయ న్యూస్ ఛానల్ లో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు..

''కొన్ని దశాబ్దాలుగా నేను యోగాభ్యాసం చేస్తున్నాను. అలాగే ఆయుర్వేద విధానాన్ని కూడా అనుసరిస్తున్నాను. నాకు వ్యాక్సిన్ అవసరమే లేదు. ఆయుర్వేదమనే పురాతన చికిత్సకు భారత్‌తో పాటు విదేశీయులు కూడా ఫాలో అవుతున్నారు. దాదాపు 100 కోట్ల మందికి పైగా ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నవారు ఉన్నారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి ఆమోదం లభిస్తుంది. ఆయుర్వేద వైద్య విధానాన్ని అల్లోపతి విధానంతో పోల్చుతూ... కొందరు ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపిస్తున్నారు'' అంటూ రాందేవ్ మండిపడ్డారు.
వ్యాక్సిన్లపై అనుమానాలు వ్యాపింపజేస్తోన్న రాందేవ్ ను దేశద్రోహం చట్టాల కింద అరెస్టు చేయాలని డాక్టర్ల సంఘం ఐఎంఏ కేంద్రాన్ని, ప్రధాని మోదీని డిమాండ్ చేసినా ఆ దిశగా కదలికలేదు. పైగా రాందేవ్.. నన్ను ఎవరూ అరెస్టు చేయలేదు, టచ్ చేయాలంటే డాక్టర్ల తండ్రులు దిగిరావాలని సవాళ్లు విసిరారు. ఈ క్రమంలో యోగా బాబాకు వ్యతిరేకంగా డాక్టర్లు దేశ్యాప్త నిరసనకు దిగనున్నారు. జూన్ 1న డాక్టర్లు దేశవ్యాప్త ఆందోళనలో పాల్గొంటారని ఐఎంఏ ప్రకటించింది.












Click it and Unblock the Notifications