మీ ‘భయ్యా’ను జాగ్రత్తగా ఉండమనండి: రేప్ కేసు నిందితుడి తరపు న్యాయవాదికి CJI వార్నింగ్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో నేరాలకు పాల్పడి బెయిల్‌పై జైలు నుంచి బయటకు వస్తున్న నిందితులకు ఘన స్వాగతాలు పలకడం సాధారణంగా మారింది. పలు కేసుల్లో ఉన్న నిందితులు బెయిల్‌పై రాగానే వారికి వారి అనుచరులు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వ్యక్తికి ఎలా స్వాగతం పలుకుతారో.. జైలు నుంచి వచ్చిన నిందితులకు కూడా అలాంటి సత్కారాలే లభిస్తుండటం శోచనీయం.

రేప్ కేసులో నిందితుడికి ఘన స్వాగతంపై సీజేఐ ఎన్వీ రమణ సీరియస్
తాజాగా, ఓ అత్యాచార కేసులో నిందితుడు బెయిల్ పై బయటికి రాగా.. అతని స్వాగతం పలుకుతూ భారీ బ్యానర్లు వెలిశాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచార నిందితుడిని బెయిల్‌పై విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేయడాన్ని సుప్రీంకోర్టు సోమవారం తీవ్రంగా పరిగణించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనానికి 'భయ్యా' అనే ప్రకటనతో కూడిన బ్యానర్లు ఉన్నాయని సమాచారం అందింది. దీంతో సీజేఐ ఎన్వీ రమణ విస్మయం వ్యక్తం చేశారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై రేప్.. బెయిల్ లభించడంతో
ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి, మూడేళ్లపాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ క్రమంలో బాధితురాలి ఫిర్యాదు చేయడంతో గత ఏడాది సెప్టెంబర్ నెలలో నిందితుడు అరెస్టయ్యాడు. కాగా, మధ్యప్రదేశ్ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో అతడికి ఘన స్వాగతం పలుకుతూ సదరు వ్యక్తి ఉండే ప్రాంతంలో అతడి అనుచరులు భారీగా హోర్డింగులు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

నిందితుడి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకు బాధితురాలు
ఈ నేపథ్యంలో నిందితుడికి మంజూరైన బెయిల్ ను రద్దు చేయాలంటూ బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ కృష్ణ మురారీ, జస్టిస్ హిమా కోహ్లీల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కాగా, ఈ సందర్భంగా నిందితుడి కోసం ఏర్పాటు చేసిన హోర్డింగుల విషయాన్ని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

‘మీ భయ్యా'ను జాగ్రత్తగా ఉండాలంటూ డిఫెన్స్ లాయర్‌కు సుప్రీంకోర్టు వార్నింగ్
ఈ క్రమంలో డిఫెన్స్ న్యాయవాదిపై సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయ్యింది. 'భయ్యా ఈజ్ బ్యాక్' అని హోర్డింగులు పెట్టడమేంటి? అసలు దీని అర్థమేంటి? బెయిల్ మంజూరు చేస్తే ఏం వేడుక జరుపుకున్నారు? ఈ వారం మీ భయ్యాను జాగ్రత్తగా ఉండమని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. నేరస్తుడికి బెయిల్ లభిస్తే వేడుకలు చేసుకోవడం ఏంటని విస్మయం వ్యక్తం చేసింది. కేసు విచారణను ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications