2గంటల ప్రయాణం 20నిముషాల్లోనే.. మోదీ ప్రభుత్వానికి రష్మిక కితాబు; ఎంతిచ్చారు? నెటిజన్ల ట్రోల్స్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మోడీ సర్కార్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముంబైలోని అటల్ సేతుపై ప్రయాణించిన సినీనటి రష్మిక అటల్ సేతు వంతెన పై తన ప్రయాణ అనుభూతిని ఏఎన్ఐతో షేర్ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండు గంటల ప్రయాణం 20 నిముషాల్లోనే
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్ర మార్గ వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ పై రష్మిక మందన్న ఇటీవల ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రెండు గంటల ప్రయాణాన్ని కేవలం 20 నిమిషాల్లోనే పూర్తి చేయొచ్చని మన దేశంలో ఇలాంటివి సాధ్యమవుతాయని ఎవరు అనుకోలేదని అన్నారు. ముంబై నుండి నవీ ముంబైకి సులువుగా ప్రయాణం చేయవచ్చునని భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని రష్మిక మందన పేర్కొన్నారు.

అభివృద్ధిని చూసి ఓటు వేయమన్న రష్మిక
ఇప్పుడు మనల్ని ఎవరు ఆపలేరు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఎన్నో విజయాలను సాధిస్తుంది అని చెప్పిన రష్మిక గత పదేళ్ల కాలంలో దేశం ఎంత అభివృద్ధి చెందిందో వివరించారు. దేశంలో మౌలిక వసతులు, రహదారి ప్రణాళిక చాలా అద్భుతంగా ఉన్నాయని పేర్కొన్న రష్మిక అభివృద్ధిని చూసి ఓటు వేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
రష్మికపై నెటిజన్లు ఫైర్
భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కితాబిచ్చిన రష్మిక బిజెపికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు, నెటిజెన్లు కొందరు ఫైర్ అవుతున్నారు. భారత్ కు సాధ్యం కానిది ఏదీ లేదని రష్మిక మందన్న చెబుతున్నారని.. భారతదేశంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కావడం లేదని విమర్శిస్తున్నారు.
పెయిడ్ ప్రమోషన్ .. ఎంతిచ్చారు అంటూ కామెంట్స్
భారతదేశంలో నిత్యవసర వస్తువుల ధరలను, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం సాధ్యం కావడం లేదని మోడీ సర్కారును పలువురు టార్గెట్ చేస్తున్నారు. రష్మిక మందన్న ఎన్నికల సమయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పైన వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ పెయిడ్ ప్రమోషన్ కోసం బీజేపీ ఎంత డబ్బు చెల్లించింది? ఎలక్టోరల్ బాండ్స్ సొమ్ము ఇలాగే వాడుతున్నారు అనుకుంటా అంటూ రష్మిక వీడియోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.బీజేపీకి పెయిడ్ ఆర్టిస్ట్ రష్మిక చేస్తున్న ప్రచారం అంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications