Banking News: రుణగ్రహీతలకు ఆర్బీఐ భారీ ఉపశమనం.. ఆ నిబంధనల అమలు వాయిదా..
RBI new Rules: దేశంలో బ్యాంకులు సహా ఇతర ఆర్థిక సంస్థలను ఆర్బీఐ నియంత్రిస్తూ ఉంటుంది. ఆయా ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, ప్రజలు సౌకర్యవంతంగా సేవలు వినియోగించుకునేందుకు తగిన నిబంధనలను ప్రవేశపెట్టడం పరిపాటే. తాజాగా రుణగ్రహీతలకు ఉపశమనం కలిగించే నిర్ణయం ఒకటి తీసుకుంది.
గతేడాది ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. తీసుకున్న లోన్ EMI తిరిగి చెల్లించడంలో రుణగ్రహీతలు విఫలమైతే, పెనాల్టీ విధించేందుకు ఆర్థిక సంస్థలకు అవకాశం కల్పించింది. ఈ రూల్ అమలు తేదీని జనవరి 1, 2024గా అప్పుడే నిర్ణయించింది. అయితే తాజాగా గడువును పొడిగిస్తూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

కొత్త రుణాల విషయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విధించే పెనాల్టీ ఛార్జీల నిబంధనల అమలును ఏప్రిల్ 1, 2024కి వాయిదా వేసింది. ఆయా సంస్థల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. కొన్ని వివరణలతో పాటు తదనుగుణంగా తమ సిస్టమ్స్ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు అదనపు సమయం అడగడంతో కేంద్ర బ్యాంక్ అంగీకరించింది.
'లోన్ డీఫాల్టర్లపై పెనాల్టీ విధించే నిబంధనలు ఏప్రిల్ 1, 2024 నుంచి అమలవుతాయి. కొత్తగా రుణం తీసుకునే వారిగి ఈ గుడువు వర్తిస్తుంది. అయితే ఇప్పటికే లోన్ పొందిన వారికి సంబంధించి తదుపరి సమీక్షలో నిర్ణయం తీసుకోబడుతుంది. కానీ జూన్ 30, 2024లోపే ఇది ఉంటుంది' అని ఆర్బీఐ ప్రకటించింది.
రుణ ఒప్పందం ప్రకారం లోన్ తిరిగి చెల్లించడంలో రుణగ్రహీత ఫెయిల్ అయితే నిబంధనలు అనుసరించి జరిమానా విధించాలి. అయితే వాటిని 'పెనాల్టీ ఛార్జీలు'గా వర్గీకరించాలని ఆర్బీఐ తెలిపింది. వీటిపై తిరిగి వడ్డీ విధించకూడదని స్పష్టం చేసింది. ఈ ఛార్జీల పరిమాణం కూడా సహేతుకంగా ఉండాలని కోరింది. వ్యాపార సంస్థలతో పోలిస్తే వ్యక్తిగత రుణాలపై జరిమానా తక్కువగా ఉండే విధంగా చూడాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications