ఆర్బీఐ గవర్నర్‌కు ఏమైంది..?!
RBI Governor Shaktikanta Das: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అనారోగ్యానికి గురయ్యారు. ఈ తెల్లవారు జామున ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు ఏమైందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. దీనిపై రిజర్వ్ బ్యాంక్ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి శక్తికాంత దాస్.. చెన్నైకి వచ్చారు. అనారోగ్యానికి గురయ్యారు. అజీర్తి సమస్యతో సతమతం అయ్యారు. కడుపులో మంటతో ఇబ్బందులకు గురయ్యారు. దీనితో థౌజండ్ లైట్స్ ఏరియా గ్రీమ్స్ రోడ్‌లో గల ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రి అపోలోలో అడ్మిట్ అయ్యారు.

ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారనే వార్త తెలియగానే పలువురు ప్రముఖులు స్పందించారు. ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తొలుత గుండె సంబంధిత సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారంటూ వార్తలొచ్చాయి. వాటన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ తోసిపుచ్చింది.
శక్తికాంత దాస్ అనారోగ్యానికి గల కారణాలను వివరిస్తూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎసిడిటీ కారణంగా ఆయన స్వల్ప ఇబ్బందులు పడ్డారని వివరించింది. అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని, ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని స్పష్టం చేసింది.
ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రెండు మూడు గంటల్లో డిశ్చార్జ్ అవుతారని పేర్కొంది. దీనిపై ఆసుపత్రి డాక్టర్ల నుంచి అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల కాలేదు. ఆయన స్వల్ప అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని, అబ్జర్వేషన్‌లో ఉన్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications