సమరానికి సిద్ధమైన తలైవా!.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని రజనీ ప్రకటన!
చెన్నై : ఎన్నికల్లో పోటీకి సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సస్పెన్స్‌కు తెర దించారు. ఎన్నికల బరిలో ఎప్పుడు దిగేది స్పష్టత నిచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తలైవా తేల్చిచెప్పారు. చెన్నైలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. రజనీకాంత్ ప్రకటనతో సూపర్ స్టార్ రీయల్ లైఫ్ పొలిటికల్ ఫైట్ గురించి ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.
తమిళనాడులో 18అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం ఉప ఎన్నిక జరిగింది. అయితే ఫలితాల తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో ఒకవేళ ఫలితాల అనంతరం అన్నాడీఎంకే ప్రభుత్వం పడిపోతే శాసనసభ సమరంలో దిగుతారా అన్న మీడియా ప్రతినిధులు ప్రశ్నపై రజనీ సానుకూలంగా స్పందించారు. ఎప్పడు నోటిఫికేషన్ వచ్చిన తాము బరిలో దిగడం ఖాయమని తేల్చిచెప్పారు. మే 23 తర్వాత పూర్తిస్థాయి నిర్ణయం వెలువరిస్తానని రజనీ స్పష్టం చేశారు.

రెండేళ్ల క్రితం రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన రజనీకాంత్ అనంతరం ఆ విషయం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం పార్టీ పేరు కూడా ప్రకటించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగుతారని ఊహించినా అదీ జరగలేదు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటిని పటాపంచలు చేస్తూ తలైవా తాజా ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications