
'రిలయన్స్ జియో 5జీ స్మార్ట్ ఫోన్ రూ. 2,500 మాత్రమే' - ప్రెస్ రివ్యూ

రిలయన్స్ జియో 2500 రూపాయలకే 5జీ స్మార్ట్ ఫోన్ అందించే ప్రయత్నాల్లో ఉందని ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.
టెలికాం రంగంలో మరో సంచలనానికి ముకేశ్ అంబానీ నిర్వహణలోని రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. రూ.5,000 కంటే తక్కువ ధరలో 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందని పత్రిక చెప్పింది.
ప్రారంభంలో 5జీ ఫోన్ ధర రూ.5,000 వరకు పెట్టినా ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ దాని ధర రూ.2,500 నుంచి రూ.3,000 మధ్య ఉంటుందని పేరు వెల్లడించేందుకు ఇష్టపడని కంపెనీ అధికార వర్గాలు చెప్పాయని రాసింది.
ప్రస్తుతం భారత మార్కెట్‌లో 5జీ టెలికాం సేవలను సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ల కనీస ధర రూ.27,000 నుంచి ప్రారంభమవుతోంది.
4జీ సేవలు ప్రారంభమైనా దేశంలో ఇంకా దాదాపు 35 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్లే వినియోగిస్తున్నారు. తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్ ద్వారా వీరిలో కనీసం 20 నుంచి 30 కోట్ల మందిని ఆకర్షించవచ్చని జియో భావిస్తోందని ఆంధ్రజ్యోతి వివరించింది.

తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు
తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు చేస్తోందని, సరిహద్దుల దగ్గరకు భారీగా సైనిక బలగాలను పంపిందని ఈనాడు కథనం ప్రచురించింది.
తూర్పు లద్దాఖ్‌లో మనతో గిల్లికజ్జాలు పెట్టుకున్న చైనా.. మరోవైపు తైవాన్ కబ్జాకు రంగం సిద్ధం చేస్తోంది.
ఈ మేరకు ఆగ్నేయ తీరంలో సైనిక మోహరింపులను నానాటికీ పెంచుతోంది. ఇదంతా తైవాన్ దురాక్రమణ కోసమేనని రక్షణ విశ్లేషకులు అనుమానిస్తున్నారని పత్రిక చెప్పింది.
సంబంధిత వర్గాల కథనం ప్రకారం చైనా సైన్యం తాజాగా తన పాత డీఎఫ్-11, డీఎఫ్-15 క్షిపణులను తొలగించి, అధునాతనమైన హైపర్‌సోనిక్ డీఎఫ్-17 క్షిపణులను ఈ ప్రాంతంలో మోహరిస్తోంది. ఈ కొత్త అస్త్రాలు చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలవు. వీటికి కచ్చితత్వం కూడా చాలా ఎక్కువని కథనంలో రాశారు.
నిజానికి తైవాన్ ఎన్నడూ చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనలో లేదు. స్వీయ పాలనలో కొనసాగుతోంది. అయినా ఆ ప్రాంతాన్ని తమ అంతర్భాగంగా చైనా అధికారులు వాదిస్తున్నారు.
తైవాన్‌ను చేజిక్కించుకునేందుకు సైనిక చర్య అవకాశాన్ని కొట్టిపారేయలేమని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతున్నారని ఈనాడు చెప్పింది.
ఆ ప్రాంతంలోని ఫుజియాన్, గువాంగ్‌డాంగ్‌లోని మెరీన్ కోర్, రాకెట్ ఫోర్స్ బలగాలను డ్రాగన్ భారీగా పెంచినట్లు ఉపగ్రహ చిత్రాలను బట్టి స్పష్టమవుతోంది.
ఈ రెండు స్థావరాల్లో ఇప్పుడు చైనా పెద్ద సంఖ్యలో ఆయుధాలను పోగేసింది. తైవాన్, కొవిడ్-19 మహమ్మారి అంశాలపై అమెరికాతో చైనాకు తీవ్ర విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
మంగళవారం గువాంగ్‌డాంగ్‌లోని ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. యుద్ధ సన్నద్ధత కోసం సర్వశక్తులను కూడగట్టాలని బలగాలకు పిలుపునిచ్చారని ఈనాడు వివరించింది.

ఫిబ్రవరికల్లా కరోనావైరస్ కట్టడి
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాను కట్టడి చేయవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు సాక్షి దినపత్రిక కథనం ప్రచురించింది.
కరోనా మహమ్మారి సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిని దాటి పోయిందని కోవిడ్–19పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తెలిపింది.
అన్ని జాగ్రత్తలు పాటిస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి కరోనాని కట్టడి చేయవచ్చునని కమిటీ అంచనా వేస్తోందని పత్రిక రాసింది.
దేశంలో కరోనా తీవ్రతపై కేంద్రం, ఐఐటీ ఐసీఎంఆర్‌కు చెందిన 10 మంది సభ్యులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే.
ఈ కమిటీకి నేతృత్వం వహించిన హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ విద్యాసాగర్ దేశంలో కరోనా పరిస్థితికి సంబంధించి పలు అంశాలను వెల్లడించారు.
మార్చిలో లాక్‌డౌన్ విధించకపోయి ఉంటే కరోనా భారత్‌పై అత్యంత తీవ్ర ప్రభావం చూపించి ఉండేదని, జూన్ నాటికే కోటి 40 లక్షల మందికి కరోనా సోకేదని, 26 లక్షల మంది వరకు మృత్యువాత పడేవారని కమిటీ తన నివేదికలో వెల్లడించిందని సాక్షి రాసింది.
సరైన సమయంలో లాక్‌డౌన్ విధించి, కరోనాని ఎదుర్కొనేలా ప్రజల్ని సమాయత్తం చేయడంతో పాటు, ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేశామని అందులో పేర్కొంది.
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం కొనసాగిస్తూ, పండుగ సీజన్‌లో కోవిడ్ నిబంధనల్ని పాటిస్తే వచ్చే ఏడాదికల్లా కరోనాని నియంత్రించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కేంద్ర కమిటీ పేర్కొందని కథనంలో రాశారు.
దేశంలోని కొన్ని జిల్లాల్లో కరోనా సామూహిక వ్యాప్తి జరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అంగీకరించారు. అయితే దేశవ్యాప్తంగా ఆ పరిస్థితి లేదని ఆయన 'సండే సంవాద్’ కార్యక్రమంలో అన్నట్లు సాక్షి వివరించింది.

తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు
మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పిందని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
తూర్పు మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
దీని ప్రభావంతో సోమవారం ఉదయానికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న చెప్పారని, అది మంగళవారానికి మరింత బలపడే అవకాశం ఉందన్నారని పత్రిక రాసింది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది.
ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు, ఒకట్రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు.
మంగళవారం నుంచి మూడు రోజులపాటు చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం అత్యధికంగా నిర్మల్ జిల్లా పెంబిలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- వీరికి వాసన తెలియదు... ఇంట్లో గ్యాస్ లీకైనా గుర్తించలేరు
- గృహహింస: 'వందల సిజేరియన్లు చేసిన నేనే ఆశ్చర్యపోయాను.. గర్భాశయం పగిలిపోవడంతో అనుమానం వచ్చింది’
- ఆంధ్రప్రదేశ్: పాఠశాలల్లో కుల, మత ప్రస్తావన లేకుండా చేయొచ్చా? విద్యా శాఖ నిర్ణయం ఆచరణ సాధ్యమేనా?
- బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టారు.. అయినా బతికాడు.. కానీ..
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- 'నాన్‌లోకల్ లీడర్ల’ అడ్డాగా విశాఖ... నగరంలో 30 ఏళ్లుగా వారి హవా సాగుతుండటానికి కారణాలేంటి?
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- 'బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)