రజినీకాంత్ ఫోన్ చేసి మరీ క్షమాపణలు చెప్పిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?
సూపర్ స్టార్ రజనీకాంత్ భారతదేశపు అగ్రశ్రేణి నటుల్లో ఒకరు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఇలా ఆయనకు భాషతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కేవలం ఇండియా లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా రజినీకి ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్, థాయ్ లాండ్, బ్యాంకాక్ సహా పలు దేశాల్లో సూపర్ స్టార్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ స్టార్ హీరో. రీసెంట్ గానే లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్ 2' మూవీలో నటిస్తున్నారు. 2023లో వీరి కాంబినేషన్ లో వచ్చిన 'జైలర్' చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. రజనీకాంత్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపించింది. దీంతో సీక్వెల్ గా రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆయనతో ఒక్క సీన్‌లోనైనా నటించాలని ఇప్పటికీ ఎంతో మంది కళాకారులు కలలు కంటుంటారు. అలాంటి రజనీకాంత్ ఒక నటి వద్దకు స్వయంగా ఫోన్ చేసి క్షమాపణ చెప్పిన విషయం ఇప్పుడు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎవరికి సారీ చెప్పారంటే..
రజనీకాంత్ స్వయంగా ఫోన్ చేసి క్షమాపణ చెప్పిన నటి మమతా మోహన్‌దాస్. ఈమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనదైన గుర్తింపు సంపాదించారు. తెలుగులో "యమదొంగ", "కింగ్", "చింతకాయల రవి", "కేడీ", "హోమం" వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా మాత్రమే కాకుండా ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా అనేక హిట్ పాటలు పాడారు. కేన్సర్‌తో పోరాడి తిరిగి సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడం ద్వారా ఆమె ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.
అయితే 2008లో విడుదలైన "కుసేలన్" చిత్రంలో మమతా మోహన్‌దాస్ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ దర్శకుడు పి. వాసు తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ మూవీకి రీమేక్‌గా రూపొందింది. సినిమాలో రజనీకాంత్ అశోక్ కుమార్ అనే సూపర్ స్టార్ పాత్రలో కనిపించగా, ఆయన చిన్ననాటి స్నేహితుడు బలకృష్ణన్ పాత్రలో పశుపతి నటించారు. స్నేహం, భావోద్వేగాలు, జీవితంలో విజయాలు-విఫలాల మధ్య బంధాల విలువను చూపించే కథతో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కాగా మమతా మోహన్‌దాస్ ఈ చిత్రంలో ఓ సినిమా దర్శకురాలి పాత్రలో నటించారు. అయితే సినిమా విడుదలయ్యాక ఆమె నటించిన దాదాపు అన్ని సన్నివేశాలు తొలగించబడటం ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె వెనుక నుంచి కనిపించే ఒక్క షాట్ మాత్రమే సినిమాలో ఉంచారు. ఈ విషయంపై మమతా మోహన్‌దాస్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సినిమా విడుదలైన కొద్ది రోజుల తర్వాత రజనీకాంత్ కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిందని, స్వయంగా రజనీకాంత్ మాట్లాడి జరిగిన పరిస్థితులపై క్షమాపణ చెప్పారని ఆమె తెలిపారు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ తనకు ఫోన్ చేసి బాధ వ్యక్తం చేయడం రజనీకాంత్ గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనమని మమత పేర్కొన్నారు.
"కుసేలన్" చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదలైంది. తెలుగులో దీనిని "కథానాయకుడు" పేరుతో విడుదల చేశారు. ఈ వెర్షన్‌లో కూడా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా, జగపతి బాబు ఆయన స్నేహితుడి పాత్రను పోషించారు. మీనా కథానాయికగా నటించారు. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం భావోద్వేగ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కథకు హిందీలో కూడా రీమేక్ రూపొందింది. "బిల్లు" పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ సూపర్ స్టార్ పాత్రలో నటించగా, ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కూడా మంచి ఆదరణ పొందింది.












Click it and Unblock the Notifications