గ్యాస్ కేవైసీ అలా చేసుకోవాలి అనుకుంటున్నారా... బీ అలెర్ట్!
సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతలా విస్తరిస్తోందో, అదే స్థాయిలో సైబర్ మోసాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టించేందుకు సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్యాస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని 'గ్యాస్ కేవైసీ ' పేరుతో రాష్ట్రంలో భారీగా మోసాలకు తెగబడుతున్నారు. దీనిపై పోలీసులు మరియు సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
గ్యాస్ వినియోగదారులకు ఈ-కేవైసీ పేరుతో సైబర్ మోసం
కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ వినియోగదారులకు ఈ-కేవైసీ తప్పనిసరి చేసిందన్న సమాచారాన్ని ఈ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. గ్యాస్ కంపెనీ ప్రతినిధులమంటూ వినియోగదారులకు ఫోన్లు చేసి మీ గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ అవ్వలేదు.. వెంటనే చేయకపోతే మీ సబ్సిడీ నిలిచిపోతుంది లేదా మీ గ్యాస్ కనెక్షన్ పూర్తిగా బ్లాక్ అవుతుంది అంటూ భయాందోళనలకు గురిచేస్తారు.

ఫేక్ లింకులు, ఏపీకే ఫైల్స్
గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే కూర్చుని మొబైల్ ద్వారా నిమిషాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చని నమ్మిస్తారు. ఆ తర్వాత వినియోగదారుల మొబైల్ నంబర్లకు లేదా వాట్సాప్‌కు కొన్ని ప్రత్యేక నకిలీ లింకులను లేదా ఏపీకే ఫైళ్లను పంపిస్తారు.
గ్యాస్ కనెక్షన్ ఆందోళనలో సైబర్ నేరగాళ్ళ బారిన పడుతున్న సామాన్యులు
కనెక్షన్ ఎక్కడ కట్ అవుతుందోననే ఆందోళనతో వినియోగదారులు ఆ లింకులపై క్లిక్ చేసి, అందులో అడిగిన పేరు, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలు, డెబిట్/క్రెడిట్ కార్డ్ నంబర్ మరియు సీవీవీ వంటి అత్యంత రహస్య సమాచారాన్ని నమోదు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో వారు పంపిన ఏపీకే (APK) అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా బాధితుల మొబైల్ ఫోన్లపై సైబర్ నేరగాళ్లు పూర్తి నియంత్రణ సాధిస్తున్నారు.
బ్యాంకు ఖాతాలలోని డబ్బులు మాయం
దీనివల్ల బ్యాంకు లావాదేవీలకు వచ్చే ఓటీపీలు నేరుగా స్కామర్ల చేతికి చిక్కి, క్షణాల వ్యవధిలో బాధితుల బ్యాంకు ఖాతాలలోని డబ్బు మొత్తం మాయమవుతోంది. గ్యాస్ కంపెనీలు లేదా ఏజెన్సీలు ఎప్పుడూ ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత వివరాలు, ఓటీపీలు లేదా బ్యాంకు సమాచారాన్ని అడగవని పోలీసులు చెప్తున్నారు. .అపరిచిత వ్యక్తులు పంపే ఎటువంటి లింకులు లేదా ఏపీకే ఫైళ్లను క్లిక్ చేయడం గానీ, డౌన్‌లోడ్ చేయడం గానీ చేయకూడదని సూచిస్తున్నారు.
కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే ఇలా చెయ్యాలి.. మోసపోతే 1930 కి కాల్ చెయ్యాలి
కేవైసీ అప్‌డేట్ కోసం ఎల్లప్పుడూ సంబంధిత గ్యాస్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌లను ఉపయోగించాలి లేదా నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించాలని సూచిస్తున్నారు.ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ మాయగాళ్ల వలలో పడి డబ్బులు కోల్పోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ www.cybercrime.gov.in లో ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications