బీజేపీ ఆపరేషన్ తెలంగాణ షురూ, కొత్త ఫార్ములా..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ కొత్త ఫార్ములా అమలు చేస్తోంది. హర్యానా.. పశ్చిమ బెంగాల్ లో అధికారం దక్కించుకున్న బీజేపీ ఇక, తెలంగాణలోనూ పాగా వేయాలని భావిస్తోంది. ఇందు కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ప్రారంభించింది. ప్రతీ ఇంటికి బీజేపీ నినాదంతో... పార్టీ కేడర్ కు బాధ్యతలు అప్పగిస్తోంది. ఈ మేరకు ఈ నెలాఖరులో రాష్ట్ర నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక.. నుంచి ముఖ్య నేతలు తరచూ తెలంగాణలో పర్యటించేలా ప్లాన్ సిద్దం చేస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ ప్రారంభించింది. హర్యానా, పశ్చిమ బెంగాల్ తరహాలోనే పార్టీలోని ఎంపిక చేసిన నేతలకు తెలంగాణ బాధ్యతలను అప్పగిస్తోంది. హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నుంచి తమ ప్రణాళికలను అమలు చేసేందుకు సిద్దం అవుతోంది. ముందుగా గ్రేటర్ లో సత్తా చాటుతూ.. క్రమేణా జిల్లాల వారీగా పట్టు సాధించేలా ప్రణాళికలను అమలు చేస్తోంది. అందు లో భాగంగా ప్రతీ ఇంటికి పార్టీని తీసుకెళ్లేందుకు క్లస్టర్ల వారీగా నేతలను మొహరిస్తోంది. వచ్చే రెండేళ్ల కాలంలో ప్రతీ ఓటరుకు చేరువ కావాలని దిశా నిర్దేశం చేస్తోంది. ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందని.. బీఆర్ఎస్ కంటే బీజేపీ మెరుగైన ఆప్షన్ గా వివరించాలని నిర్ణయించింది. గతంలో బీజేపీ దుబ్బాక, హుజూరాబాద్‌లతో పాటు ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో కాషాయ దళం ప్రయోగించిన హైపర్ లోకల్ గ్రౌండ్ స్ట్రాటజీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సిద్దం అవుతోంది.

తెలంగాణలో కొత్త ఫార్ములాతో ముందుకు
అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే ముందుగానే ప్రత్యర్థుల వ్యూహాలకు చిక్కకుండా, క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంక్ పునాదులను కదిలించేలా బీజేపీ మాస్టర్ ప్లాన్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యం గా న్యూట్రల్ ఓటర్లను తమ వైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఎలాంటి హంగామా లేకుండా గ్రామాల్లో చొచ్చుకొని పోవాలని ఇప్పటికే కేడర్ కు నిర్దేశం చేసారు. సామాజిక వర్గాల వారీగా బాధ్యతలను ఎంపిక చేసి కేటాయిస్తున్నారు. సోషల్ ఇంజనీరింగ్ లో పొరపాట్లు లేకుండా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త టీంలు రంగంలోకి దిగుతున్నాయి. బీసీ నినాదంతో గత ఎన్నికల్లో బీజేపీ ముందుకు వెళ్లినా..లక్ష్యం చేరలేదు. దీంతో.. ఈ సారి బీసీ వర్గాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. బలమైన బీసీ సామాజిక వర్గాలైన మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ, గౌడ, ముదిరాజ్ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశమవుతోంది. దళిత, గిరిజన ఉపకులాల స్థానిక పెద్దలతో చర్చలు జరుపుతోంది. సోషల్ మీడియాను బలంగా వాడుకొని ఓటర్లతో మమేకం అయ్యే విధంగా బీజేపీ కొత్త వ్యూహాలను పార్టీ నేతలకు నిర్దేశించేందుకు సిద్దమైంది. వచ్చే నెల నుంచి బీజేపీ ముఖ్య నేతలు తెలంగాణలో వరుసగా పర్యటనలు చేయనున్నారు. దీంతో.. బీజేపీ ప్లాన్లు ఎంత వరకు వర్కవుట్ అవుతాయనేది ఆసక్తి కరంగా మారుతోంది.













Click it and Unblock the Notifications