మోడీ ఏం చేస్తున్నారు?: వరుస రేప్‌లపై కేజ్రీ ఫైర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇద్దరు మైనర్లు సామూహిక అత్యాచారానికి గురైన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఢిల్లీలో వరుస అత్యాచారాలు జరుగుతుంటే ప్రధాని ఏం చేస్తున్నారని ఫ్రశ్నించారు.
ఢిల్లీ ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం మాని మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, ఢిల్లీ పోలీసులు తమ అసలు విధులను వదిలిపెట్టి తమను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం కిందకు వస్తారు కాబట్టే తాను ప్రధానిని దీనిపై ప్రశ్నిస్తున్నానని చెప్పారు. తన ప్రభుత్వానికి పోలీసులపై నియంత్రణ లేదనే విషయం అందరికీ తెలుసనని ఆయన చెప్పారు. ఢిల్లీ పోలీసులపై నియంత్రణ తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
మైనర్ బాలికలపై వరుస అత్యాచారాలు సిగ్గుచేటు మాత్రమే కాకుండా ఆందోళన కలిగించే విషయమని కేజ్రీవాల్ అన్నారు. రక్షణ కల్పించడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అంటూ ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.












Click it and Unblock the Notifications