కర్నాటక ఎన్నికలు : హసన్ సీటుపై దేవెగౌడ కుటుంబంలో చిచ్చు-వదినకు వద్దంటున్న కుమారస్వామి
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జేడీఎస్ కు తమ కంచుకోట హసన్ సీటు తలనొప్పిగా మారుతోంది. ఈ సీటులో పోటీ చేసేందుకు దేవెగౌడ కుటుంబ సభ్యులు పోటీ పడుతుండటంతో వీరిలో ఎవరికి ఇది కేటాయించాలన్న దానిపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు.
కర్ణాటకలో మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు హాసన్ స్థానానికి అభ్యర్థి ఎంపిక విషయంలో దేవెగౌడకు సవాళ్లు తప్పడం లేదు. దీనికి ప్రధాన కారణం దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ఈ సీటుపై కర్ఛీఫ్ వేసుకోవడమే. ఈ సీటును తనకే కేటాయించాలని భవానీ పట్టుబడుతున్నారు. ఈ ప్రతిపాదనను ఆమె మరిది, జేడీఎస్ కీలక నేత కుమారస్వామి వ్యతిరేకిస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఇది చిచ్చు రేపుతోంది.

హసన్ సీటు ఎవరికివ్వాలనే అంశంపై ఆదివారం తన ఇద్దరు కుమారులు రేవణ్ణ, కుమారస్వామితో పాటు భవానీ రేవణ్ణతో కలిపి చర్చలు జరిపిన దేవెగౌడ .. ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. హసన్ సీటు నుంచి ఇక్కడి జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ హెచ్ ఎస్ ప్రకాష్ ను బరిలోకి దించాలని కుమారస్వామి భావిస్తున్నారు. కానీ అన్న రేవణ్ణ భార్య భవానీ మాత్రం తానే బరిలోకి దిగుతానని పట్టుబడుతున్నారు. కార్యకర్తల అభిప్రాయాల్ని పరిగణనలోకి తీసుకుని దేవెగౌడ దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటారని కుమారస్వామి చెబుతున్నారు.
మరోవైపు హసన్ నుంచి తనకు పోటీ చేసేందుకు అవకాశం దక్కకపోతే ఇండిపెండెంట్ అభ్యర్ధిగా అయినా బరిలోకి దిగేందుకు భవానీ సిద్దమవుతున్నారన్న వార్తలు జేడీఎస్ లో కలకలం రేపుతున్నాయి. దీనిపై కుమారస్వామిని మీడియా ప్రశ్నించింది. అయితే ఆయన దీనిపై ఆమెనే అడగాలని వారికి సూచించారు. అయితే దేవెగౌడ ఏం చెబితే అదే ఫైనల్ అని ఆయన అంటున్నారు.












Click it and Unblock the Notifications