• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రిషి సునక్: బ్రిటన్ కొత్త ప్రధాన మంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందా.. ఇరు దేశాల సంబంధాలు బలపడతాయా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
రిషి సునక్

రిషి సునక్ గురించి భారతదేశం ఏమనుకుంటోందో పతాక శీర్షికలు చాటుతున్నాయి.

భారత సంతతికి చెందిన 42 ఏళ్ల టోరీ నాయకుడు బ్రిటిష్ ప్రధానమంత్రిగా ఎన్నికవటం.. చాలా మంది భారతీయుల మనసులను సంతోషంతో నింపేసినట్లు కనిపిస్తోంది. సందేహజీవులు సైతం సంతోషించకుండా ఉండలేకపోతున్నారు.

అయితే జాతీయువాదులు మరింత ఎక్కువగా సంబరపడుతున్నారనేది నిజం. సునక్ మతవిశ్వాసాన్ని బట్టి ఆయన తమ వాడని వాదించటం మీద వారు మరింత ఆసక్తిగా ఉన్నారు.

'సగర్వమైన హిందువు' రిషి సునక్ బ్రిటన్ కొత్త ప్రధాని - అని భారతదేశంలో అతి పెద్ద ఇంగ్లిష్ దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఆ కథనంలో హిందు అనే పదాన్ని ఐదుసార్లు ప్రస్తావించింది.

'బీయింగ్ హిందు ఇన్ 10 డౌనింగ్ స్ట్రీట్ (10 డౌనింగ్ స్ట్రీట్‌లో హిందువు)' అంటూ ఇండియా టుడే ఓ కథనం రాసింది. రిషి సునక్ 'హిందువు అయినా కూడా అత్యున్నత పదవి పొందారని, హిందువు అయినందు వల్ల కాదని' ఆ కథనంలో పేర్కొంది.

ఇతర పత్రికలు వలసపాలన ప్రస్తావనలు ఉపయోగించాయి: 'సునక్: ఎక్స్-ఇండియా కంపెనీ సెట్ టు రన్ బ్రిటన్ (బ్రిటన్‌ను పాలించబోతున్న ఎక్స్-ఇండియా కంపెనీ) అనే శీర్షికతో ది టెలిగ్రాఫ్ కథనం రాసింది. భారతదేశంలో అత్యధిక ప్రాంతాలను కిరాయి సైనికులతో నియంత్రించిన సంస్థను పరోక్షంగా ప్రస్తావించింది.

టెలిగ్రాఫ్ దినపత్రిక మొదటి పేజీ స్క్రీన్

హిందీ దినపత్రిక దైనిక్ భాస్కర్ 'జాతికి మరో దివాలీ కానుక, తెల్లవారిని పరిపాలించబోతున్న భారత మూలాలున్న రిషి' అనే శీర్షికతో వార్త రాసింది.

చాలా మంది భారతీయుల దృష్టిలో రిషి సునక్ కొత్త పదవికి సుసంపన్నమైన సంకేతం: బ్రిటన్ కొత్త ప్రధానమంత్రితో భారత్‌కు మేలు జరుగుతుందని వారు నమ్ముతున్నట్లు కనిపిస్తోంది.

ఆగస్టులో రిషి సునక్ ఉత్తర లండన్‌లో ప్రధానంగా బ్రిటిష్ ఇండియన్లు పాల్గొన్న సమావేశంలో సంప్రదాయ అభివందనంతో.. ప్రధాని పదవి కోసం తన ప్రచారం ప్రారంభించారు. మధ్యలో హిందీలో కూడా మాట్లాడారు. తాను ప్రధానమంత్రిని అయితే భారతదేశంతో సంబంధాలను బలోపేతం చేయటానికి పనిచేస్తానని చెప్పారు.

రిషి సునక్ బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడిగా భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇటీవల ఒక సంప్రదాయ కార్యక్రమంలో ఆవును పూజించారు. డౌనింగ్ స్ట్రీట్‌లోని తన నివాసంలో దీపావళి దీపాలు వెలిగించారు. భారతదేశంలో ఓ మతం లాగా మారిన క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా చెప్తారు.

ఆయన మామ ఎన్.ఆర్.నారాయణమూర్తి ఓ సాఫ్ట్‌వేర్ అపర కుబేరుడు. భారతదేశానికి గర్వకారణమైన భారీ ఔట్‌సోర్సింగ్ కంపెనీ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు.

నారాయణమూర్తి తన కుమార్తె అక్షతా మూర్తికి రిషి సునక్‌తో నిశ్చితార్థం అయిన తర్వాత, ఆమెకు రాసిన లేఖలో రిషి గురించి ఇలా రాశారు: ''అంతా నువ్వు చెప్పినట్లు ఉన్నాడు - చాలా తెలివైనవాడు, అందగాడు. ఇంకా ముఖ్యంగా నిజాయితీపరుడు''.

బ్రిటిష్ ఇండియన్లతో రిషి సునక్

ఈ ఏడాది ఇంతకుముందు రిషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి పోటీలోకి వచ్చినపుడు.. ఆ విషయంపై ఇండియాలో సోషల్ మీడియాలో హాస్యపూరిత ప్రతిస్పందనలు కనిపించాయి. ఆయన ప్రధాని కావటం పట్ల సంబరాలు చేసుకోవటం నవ్వుతెప్పిస్తోందని కొందరు స్పందించారు.

అయితే రచయిత కంచ ఐలయ్య షెపర్డ్ వంటి ఇతర భారతీయులు.. రిషి సునక్ అత్యున్నత పదవికి ఎన్నికవటం.. ''బ్రిటిష్ ఓటర్లు, రాజకీయ వర్గాల్లో భిన్నసంస్కృతుల పట్ల సహనం గణనీయమైన సరికొత్త స్థాయికి పెరిగింద''నే విషయాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.

ప్రవాస భారత సంతతి ఎదుగుదల పట్ల భారతీయులు ఎల్లప్పుడూ చాలా పట్టించుకుంటారని న్యూయార్క్‌లో నివసించే భారతీయ రచయిత సలీల్ త్రిపాఠి చెప్పారు.

''సుందర్ పిచాయ్ గూగుల్‌ను నడిపినపుడు, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహించినపుడు భారతీయులు గర్వపడతారు. విదేశాల్లో ఈ విజయాలు భారతీయ శ్రేష్ఠతకు గెలుపుగా వీరు చూస్తారు. ఓ విదేశీ వాతావరణంలో ఈ వ్యక్తులు విజయం సాధించటం మరింత గర్వకారణమైన విషయం'' అని త్రిపాఠి పేర్కొన్నారు.

అయితే ఈ చర్చలో వర్గం అనే అంశం సాధారణంగా కనిపించదు. రిషి సునాక్ ఓ సంపన్న స్కూలులో చదువుకున్నారు. ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలకు వెళ్లారు. ఇదే తరహాలో భారతీయ కార్పొరేట్ విజేతలు కూడా ప్రధానంగా సంపన్న భారత యూనివర్సిటీల నుంచి ఉత్పత్తి అయిన వారేనని త్రిపాఠి చెప్తారు.

కన్జర్వేటివ్ పార్టీకి చెందిన భారత సంతతి రాజకీయవేత్తలు చాలా వరకూ టోరీలకు బలమున్న సీట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని.. ''ఆ మేరకు భారత సంతతిలో లేదా ఆసియా సంతితిలో వారికున్న ఆదరణ పరిమితం'' అని త్రిపాఠి అభిప్రాయపడ్డారు.

''రిషి సునక్ సాధించిన విజయం నిస్సందేహంగా మరింత ముఖ్యమైనది. ఎందుకంటే.. తన సొంత వలస పాలన చరిత్ర ఉన్న దేశానికి, ఇప్పటికీ జాతి వివక్ష పట్టిపీడిస్తున్న సమాజానికి ఆయన ప్రధానమంత్రి అయ్యారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''భారత్-బ్రిటన్ సంబంధాన్ని భిన్నంగా చూడాల్సిన అవసరం ఉంది.. ఎందుకంటే ఇక్కడ బ్రిటన్‌లో ఉన్న మనం భారత్ నుంచి నేర్చుకోగలిగింది అపారంగా ఉంది'' అని రిషి సునక్ గత ఆగస్టులో భారత సంతతితో నిర్వహించిన ఒక ప్రచార కార్యక్రమంలో పేర్కొన్నారు.

''బ్రిటన్‌కు, భారతదేశంతో పనిచేయటానికి - ప్రత్యేకించి బ్రిటన్, భారత్‌లు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రారంభించటంపై కృషి చేస్తున్న ఈ తరుణంలో - రిషి గొప్ప ప్రధాని అవుతారు. ఆయనకు చాలా అనుభవం ఉంది. ఆర్థికమంత్రిగా కోవిడ్ మహమ్మారి సమయంలో ఉద్యోగాలు, వ్యాపారాలను కాపాడటంలో తన నైపుణ్యాలను ప్రదర్శించారు'' అని కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా సంస్థ డైరెక్టర్ నయాజ్ క్వాజీ చెప్పారు.

భారతదేశం విషయానికి వచ్చినపుడు.. స్తంభించిపోయిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పునరుద్ధరించటం రిషి సునక్ ప్రధాన విధి అవుతుంది. జనవరిలో ఇరు పక్షాలూ దీనిపై చర్చలు ప్రారంభించాయి. లెదర్, జువెలరీ, టెక్స్‌టైల్స్, ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెరగాలని, విద్యార్థులకు, వ్యాపారులకు మరిన్ని వీసాలు లభించాలని భారత్ ఆశిస్తోంది.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి రెట్టింపు చేసి 10,000 కోట్ల డాలర్లకు పెంచాలన్న లక్ష్యంతో ఈ ఒప్పందంపై చర్చలు ప్రారంభించారు. అయితే.. ''ఇక్కడ గడువు తీరిపోయినా నివాసం కొనసాగిస్తున్న అతి పెద్ద ప్రజా బృందం భారత వలసదారులే. ఈ తరుణంలో ఈ ఒప్పందం వల్ల బ్రిటన్‌కు భారతీయ వలసలు పెరుగుతాయి'' అంటూ భారత సంతతికి చెందిన బ్రిటన్ మాజీ హోంమంత్రి సుయెల్లా బ్రావర్మన్ వ్యాఖ్యానించటంతో ఆ ఒప్పందం ఇక్కట్లలో పడినట్లు కనిపిస్తోంది. బ్రిటన్‌ను అధిగమించి ప్రపంచంలో ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన భారతదేశంతో ఆ ఒప్పందం ఖరారు చేసుకోవటానికి తాను గట్టిగా కట్టుబడి ఉన్నానని రిషి సునక్ చెప్పారు.

భార్య అక్షతామూర్తి, ఇద్దరు కూతుర్లతో రిషి సునక్

కొత్త ప్రధానమంత్రి హయాంలో భారత్-బ్రిటన్ సంబంధాలు బలపడతాయని దిల్లీలోని జవహర్‌లాల్ యూనివర్సిటీకి చెందిన హాప్పీమన్ జాకబ్ నమ్ముతున్నారు. అయితే.. ''అది రిషి సునక్‌ భారతీయ మూలాల వల్ల కాదు.. వేరే రెండు కారణాలున్నాయి, ఒకటి - ఎఫ్‌టీఏ, రెండోది చైనా వ్యతిరేకత'' అని ఆయన అంటారు.

''రిషి సునక్ ప్రచారంలో వినిపించిన చైనా వ్యతిరేకతను బట్టి చూస్తే.. చైనాను ఒక ముప్పుగా పరిగణించే తన అభిప్రాయాన్ని బ్రిటన్ మరింత బాహాటంగా చూపుతుంది'' అని ఆయన పేర్కొన్నారు.

అలాగే.. ''ఎఫ్‌టీఏను ఖరారు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. పశ్చిమ దేశాలు, ముఖ్యంగా బ్రిటన్.. చైనాతో తలపడటాన్ని కూడా భారత్ ఇష్టపడుతుంది'' అని జాకబ్ చెప్పారు.

ఇంకొందరు అలా భావించటం లేదు. ''రిషి సునక్ అజెండాలో భారత్ అగ్రస్థానంలో ఉండదు'' అని దిల్లీకి చెందిన విధాన విశ్లేషకుడు సంజయ బారు అభిప్రాయపడ్డారు. ''దేశంలో అంతర్గతంగా పరిష్కరించాల్సిన ఆర్థిక సవాళ్లున్నాయి. యూరోపియన్ యూనియన్‌తోను, అమెరికాతోను వెలుపల సుస్థిరతను పునరుద్ధరించాల్సి ఉంది. కాబట్టి భారతదేశం ఆయన ప్రప్రధమ ప్రాధాన్యత కాబోదు. మనం ఓపికగా వేచి ఉండాల్సి ఉంటుంది'' అన్నారాయన.

ప్రపంచంలో 25 దేశాల్లో 200 మందికి పైగా భారత మూలాలున్న నేతలు రాజకీయ అధికార పదవులకు ఎన్నికయ్యారని, 10 ప్రభుత్వాలకు భారత సంతతి వ్యక్తులు అధిపతులుగా ఉన్నారని ఆయన ప్రస్తావించారు. ఐర్లండ్‌కు లియో వరాడ్కర్ ప్రధానమంత్రి అయినపుడు.. బ్రిటన్, ఐర్లండ్ రెండు దేశాలకూ భారత సంతతి నాయకులు ఉంటారు.

''వారిలో చాలా మంది భారతదేశానికి ఇబ్బందులు లేని స్నేహితులుగా ఉన్నారు. కానీ కొందరు భారత దౌత్యాధికారులు కష్టపడి పనిచేసేలా చేశారు'' అని బారు వ్యాఖ్యానించారు.

''భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కావాలని రిషి సునక్ కోరుకుంటారు. కానీ అందుకు బ్రిటన్ వలస (ఇమిగ్రేషన్) విధానాన్ని గణనీయంగా మార్చి పణంగా పెట్టటానికి ఇష్టపడరు. బ్రిటన్ ప్రయోజనాలకు రిషి సునక్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు'' అని త్రిపాఠి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Rishi Sunak: Will it be good for India with the new Prime Minister of Britain... Will the relations between the two countries be strengthened?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X