ఏపీ, టీ నా సొంత రాష్ట్రాలు: బీజేపీలోకి రామ్ మాధవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయటానికి శాయశక్తులా కృషి చేస్తానని ఆ పార్టీలో చేరిన ఆర్‌ఎస్‌ఎస్ మాజీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్ గురువారం చెప్పారు. రెండు రాష్ట్రాలు తనకు సొంత రాష్ట్రాలేనని చెప్పారు. గురువారం ఆయన బీజేపీలో చేరారు.
బిజెపి మాతృ సంస్థ అయిన సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన రామ్ మాధవ్ ఇకనుంచి బిజెపికి సేవలు అందించనున్నారు. గురువారం ఆయన ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు.

అనంతరం రామ్ మాధవ్ విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకత్వం తనకు ఏ బాధ్యతలను అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణల్లో పార్టీని ప్రజలకు చేరువ చేసేందుకు తీవ్రంగా పాటు పడాల్సి ఉందని అన్నారు. లోకసభ ఎన్నికలలో సాధించిన ఘన విజయం త్వరలో జరగనున్న విధానసభ ఎన్నికల్లో పునరావృతమై తీరుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
గత పదేళ్ల యూపీఏ పాలనలో జరిగిన అవకతవకల వల్ల దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతోపాటు అనేక ఇతర రుగ్మతలు దేశాన్ని పట్టి పీడిస్తున్నప్పటికీ ఆర్థిక మంత్రి జైట్లీ అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే బడ్జెట్‌ను ప్రతిపాదించారన్నారు.
కాగా, బీజేపీలో చేరిన రామ్ మాధవ్‌కు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఆ పదవిలో రాంలాల్ ఉన్నారు. అయితే, అమిత్ షా పార్టీ పునర్ వ్యవస్థీకరణ పైన అప్పుడే తొందర పడటం లేదని మరికొందరు అంటున్నారు. అయితే, పార్టీలో యువ రక్తాన్ని నింపాలని అమిత్ షా భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications