మోడీపై ఆరెస్సెస్ అసంతృప్తి, హర్యానా సీఎం రేసులో వీరే
ముంబై/ఢిల్లీ: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల పైన ఆరెస్సెస్ నేత వైద్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పని తీరు పైన పెదవి విరిచారు. మోడీ, షాలు జనాన్ని సమీకరించారు కానీ అవసరమైనన్ని ఓట్లు సాధించలేకపోయారని విమర్శించారు. ఎన్సీపీతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవద్దని సూచించారు. శివసేనతో పొత్తు పెట్టుకోవచ్చునని తెలిపారు.
హర్యానా సీఎం రేసులో వీరే..
హర్యానా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటింది. రాష్ట్రంలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను యాభై స్థానాలకు పైగా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే బీజేపీ పది స్థానాలను గెలుచుకుంది. మరో నలభైకి పైగా స్థానాలలో ముందంజలో ఉంది. ఎన్ఆర్ఎల్డీ రెండో స్థానానికి, కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.

హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేజిక్ ఫిగర్ 46. బీజేపీ యాభై స్థానాల వరకు గెలవనుండటంతో ముఖ్యమంత్రి రేసులో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవి జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని వరిస్తుందా లేక ఇతర వర్గాలకు దక్కుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ విలాస్ శర్మ, ఆరెస్సెస్ నేత మనోహర్ లాల్ ఖట్టార్, బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు ఓం ప్రకాశ్ దస్కర్, బీజేపీ అధికార ప్రతినిధఇ కెప్టెన్ అభిమన్యు సింధులు సీఎం రేసులో ఉన్నారు. పార్టీ అధిష్టానం ఎవరికి కట్టబెడుతుందో తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో అధికంగా ఉండే జాట్‌ల వర్గానికి చెందిన వారిని ముఖ్యమంత్రిగా నియమించాలనుకుంటే కెప్టెన్ అభిమన్యు సింధు, ఓం ప్రకాశ్ దన్కర్‌లలో ఒకరికి ముఖ్యమంత్రి పీఠం దక్కుతుంది. అయితే, రాష్ట్రంలోని నాన్ జాట్, నాన్ జాట్ అర్బన్ ఓటర్లు కూడా బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించినందున, గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయానికి తెర దించేందుకు కూడా బీజేపీ జాట్ కాని వారిని సీఎం చేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.
పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామ్ విలాస్ శర్మ, ఆరెస్సెస్ నేత ఖట్టార్ ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ఉన్నారు. ధన్కర్, కెప్టెన్ అభిమన్యు సింధు, రామ్ విలాస్ శర్మ, ఖట్టార్‌లతో పాటు హర్యానాకు చెందిన కేంద్రమంత్రులు సుష్మా స్వరాజ్, రావు ఇంద్రజిత్ సింగ్‌లు కూడా రేసులో ఉన్నారు.












Click it and Unblock the Notifications