కరోనా హాట్ స్పాట్లుగా ఆస్పత్రులు -అవసరం లేకున్నా పోతున్నారు -WHO షాకింగ్ కామెంట్స్
భారత్‌లో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదరకంగా కొనసాగుతోంది. గడిచిన ఆరు రోజులుగా రోజువారీ కొత్త కేసులు 3లక్షలకుపైగా నమోదవుతూ, మొత్తం మరణాల సంఖ్య 2లక్షలకు చేరువైంది. ఇండియాలో సెకండ్ వేవ్ పరిస్థితులు హృదయవిదారకం కంటే దారుణంగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనొమ్ ఆందోళన వ్యక్తం చేసిన మరుసటిరోజే డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు మరికొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు..

ఆస్పత్రులన్నీ కిటకిట..
ఇండియాలో ఇప్పుడు ఏ మూలలో ఏ ఆస్పత్రికి పోయినా కరోనా రోగులు, వారి బంధువులతో ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతోన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాదిలోని పలు ఆస్పత్రుల వద్ద విపరీతమైన రద్దీ సర్వసాధారణంగా మారింది. ఇది చాలదన్నట్లు ఆక్సిజన్ కోసం భారీ ఎత్తున క్యూలైన్లూ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆస్పత్రులు సైతం కరోనా హాట్ స్పాట్లుగా మారిపోయాయని ప్రంపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

కొత్త హాట్ స్పాట్లు అవే..
WHO అధికార ప్రతినిధి తారీఖ్ జసారెవిక్ మంగళవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ భారత్ లో కొవిడ్ పరిస్థితిపై అనూహ్య కామెంట్లు చేశారు. వైరస్ కట్టడి చర్యల్లో వైఫల్యం, సామూహిక కార్యక్రమాల నిర్వహణ, మాస్కుల వాడకంలో నిర్లక్ష్యం, వ్యాక్సినేషన్ ప్రక్రియలో మందగమనం తదితర కారణాల వల్లే ఇండియాలో రెండో దశ వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉందని, ఇప్పుడు జనం పెద్ద ఎత్తున ఆస్పత్రులకు తరలివస్తుండటంతో అవి కూడా హాట్ స్పాట్లుగా మారే పరిస్థితి తలెత్తిందని అన్నారు.

చేరాల్సిన అవసరం లేకున్నా..
'COVID-19 బారిన పడిన వాళ్లలో వాస్తవానికి 15శాతం కన్నా తక్కువ మందికే ఆసుపత్రి సంరక్షణ అవసరం ఉంటుంది. ఇక ఆక్సిజన్ అవసరం కూడా చాలా తక్కువమందికే ఉంటుంది. కానీ భారత్ లో సమాచార లోపం లేదా సలహాలు అందుబాటులో లేని కారణంగా ఆస్పత్రుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ పరిణామం మరింత ఆందోళనకరం. ఇంట్లో ఉండి కూడా కోలుకునే అవకాశం ఉండికూడా అనవసరంగా ఆస్పత్రులకు వస్తున్నారు'' అని డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధి వ్యాఖ్యానించారు.

హోం ఐసోలేషన్లు పెరిగేలా..
ఎక్కడిక్కడ స్థానిక(కమ్యూనిటీ)స్థాయిలోనే కొవిడ్ పరీక్షలు, రోగుల నిర్ధారణ చేపట్టి, హోం ఐసోలేషన్లోనే చికిత్స తీసుకునేలా సలహాలు ఇవ్వాలని, హాట్‌లైన్‌లు లేదా డాష్‌బోర్డుల ద్వారా కూడా సమాచారం అందుబాటులో ఉంచితే జనం ఆస్పత్రులకు రావడాన్ని తగ్గించగలమని తారీఖ్ పేర్కొన్నారు. భారత్ లో కరోనా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, డబ్ల్యూహెచ్ఓకు చెందిన 2400మంది వైద్య సిబ్బంది ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారని, ఆక్సిజన్, అత్యవసర మందులను పంపుతున్నామని తారీఖ్ తెలిపారు.












Click it and Unblock the Notifications