శబరిమల ఆలయంలో శరణుఘోష..!!
తిరువనంతపురం: లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు ఇవ్వాళ తెరచుకోనున్నాయి. ఈ సాయంత్రం 5 గంటలకు స్వామివారి ఆలయం తలుపులను అర్చకులు తెరవనున్నారు. రెండు నెలల పాటు మణికంఠుడు భక్తులకు దర్శనం ఇస్తాడు. వార్షిక మండలం-మకరవిళక్కు దర్శనాలకు అధికారులు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.
మండల పూజ కోసం శబరిమల శ్రీ ధర్మశాస్తా ఆలయం ఈ సాయంత్రం 5 గంటలకు తంత్రి కందరరు రాజీవరు సమక్షంలో ప్రధాన అర్చకుడు ఎన్ పరమేశ్వరన్ నంబూత్రి.. స్వామివారి గర్భాలయం తలుపులను తెరుస్తారు. ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ పూజల అనంతరం భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనానికి అనుమతి ఇస్తారు. వార్షిక మండలం-మకరవిళక్కు పుణ్యకాలం గురువారం నుంచి ప్రారంభమవుతుంది. మండలం తరువాత ఆలయాన్ని మూసివేస్తారు.

మళ్లీ మకరవిళక్కు కోసం వచ్చే సంవత్సరం డిసెంబర్ 30వ తేదీన ఆలయాన్ని మళ్లీ తెరుస్తారు అర్చకులు. 2023 జనవరి 20వ తేదీన మూసివేస్తారు. ఆన్‌లైన్ విధానంలో దర్శనం స్లాట్‌లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది భక్తులకు. అలా చేయలేని భక్తుల కోసం భౌతికంగా బుకింగ్ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. దీనికోసం ప్రత్యేకంగా నిలక్కల్‌లో 10 కౌంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్ sabarimalaonline.org. భక్తులు తమ పేరు, పుట్టిన తేదీ, పిన్ కోడ్‌తో కూడిన చిరునామా, గుర్తింపు కార్డును స్కాన్ చేసిన కాపీల, మొబైల్ ఫోన్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ-మెయిల్ ఐడీని కూడా అందులో పొందుపరచాలి. రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయడానికి ఓటీపీని ఇమెయిల్ లేదా మొబైల్ ఫోన్‌కు అందుతుంది. దర్శనం కోసం ఒక అకౌంట్ నుంచి 10 మంది భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. మొబైల్ నంబర్‌తో సహా వ్యక్తిగత వివరాలు వేర్వేరుగా ఉండాలి.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి కోట్లాది మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని ట్రావెన్‌కూర్ దేవస్వొం బోర్డు అధికారులు అంచనా వేస్తోన్నారు. ఈ సీజన్‌లో 15 లక్షలమంది భక్తులు శబరి గిరీశుడిని దర్శించుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం నీలక్కల్, పత్తినంతిట్ట సహా రైల్వే, బస్ స్టేషన్లల్లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించనున్నారు.












Click it and Unblock the Notifications